ఉప్పు ప్యాకెట్లు+రేషన్‌ బియ్యం = బంగారం రెడీ! | Woman Cheater Fraud With Fake Gold In Peeleru Chittoor | Sakshi
Sakshi News home page

కిలోల కొద్దీ బంగారం.. మీకూ ఈ ఫార్ములా కావాలంటే..

Sep 26 2019 10:14 AM | Updated on Sep 26 2019 2:53 PM

Woman Cheater Fraud With Fake Gold In Peeleru Chittoor - Sakshi

బంగారు నిధి పేరిట మల్లిక ప్లాస్టిక్‌ గోతాల్లో ప్యాక్‌ చేసి ఇచ్చిన ట్రంకుపెట్టెలు, సూట్‌కేసులు, ఇన్‌సెట్‌లో మల్లిక

ఉప్పు ప్యాకెట్లు+రేషన్‌ బియ్యం+పూజా సామగ్రి = బంగారం రెడీ! ఇప్పటివరకు ఎవరూ కనుగొనని బంగారం తయారీ ఫార్ములా ఇది!! ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నిరీక్షణ ఫలిస్తే కిలోల కొద్దీ బంగారమే అంటూ.. బంగారం అని ఎగిరి గంతేసిన బంగారం పిచ్చోళ్ల ఆశని క్యాష్‌ చేసుకుంది అక్షర జ్ఞానంలేని ఓ మహిళ. ఈ ఫార్ములాతో ఉద్యోగస్తులు, విద్యావంతుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి జంప్‌ అయ్యింది. చివరకు మిగిలింది..ఉప్పూ.. బియ్యం..ఇటుకలేనని గగ్గోలు పెట్టడం బాధితుల వంతైంది. మీకూ ఈ ఫార్ములా కావాలంటే...

సాక్షి, పీలేరు(చిత్తూరు): బంగారు నిధి ఇస్తానంటూ ఓ మహిళ పలువురినీ ఆకర్షించి, లక్షలకు లక్షలు వసూలు చేసి ఉడాయించిన సంఘటన పీలేరులో వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.2కోట్ల పైచిలుకు దండుకుని ఆమె అదృశ్యమైంది. బాధితుల కథనం..స్థానిక సైనిక్‌ నగర్‌లో మల్లిక (55) అనే మహిళ కొన్నేళ్లుగా నివసిస్తోంది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆ వృత్తిపై విరక్తి పుట్టిందేమో మరి.. తనకు వచ్చిన కొత్త ఆలోచన, కలలకు రెక్కలు తొడిగింది. తనకు నిధి దొరికిందని, అందులో కొంత ఇస్తానని కొందరికి నమ్మబలికింది.

ఇందుకోసం కొంతకాలం పాటు పూజలు చేయాలని, ఈ పనిగా ఇతర రాష్ట్రాల నుంచి కొందరు స్వామీజీలు వస్తున్నారని, దొరికిన నిధికి శాంతి పూజలు చేసిన తర్వాతే ఆ బంగారాన్ని కరిగించే పనులు చేస్తామని చెప్పింది. ఆ తర్వాత బిస్కెట్ల రూపంలో మార్చి బంగారం ఇస్తానని చెప్పడంతో అందరూ బంగారు కలల్లో విహరించారు. పూజల కోసం లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. దీంతో మొదటి అంకం పూర్తయ్యింది. నెలలు దాటినా ఆమె బంగారం ఇవ్వకపోవడంతో కొందరు ఆమెపై ఒత్తిడి చేశారు. దీంతో ఆమె రెండో అంకానికి తెరతీసింది. వారికి ట్రంకు పెట్టెలు, సూటుకేసులు ప్లాస్టిక్‌ సంచుల్లో ఫుల్‌గా ప్యాక్‌ చేసి ఇచ్చింది. వీటిలో నిధి భద్రపరిచానని, తమ పూజలు పూర్తయ్యాకే వాటిని తెరవాలని, ఈలోపు వాటిని తెరిస్తే పెట్టెల్లోని బంగారు నిధి బొగ్గులా మారిపోతుందని హెచ్చరించింది. పైగా ఆమె ఇచ్చిన సూట్‌కేసులు కూడా 10 నుంచి 20 కిలోల వరకూ బరువు ఉండడంతో అబ్బో! ఎంత నిధి ఉందో? ఇందులో అని సంబరపడ్డారు.

వాటిని తీసుకెళ్లి ఇంట్లో పూజగదిలో భద్రపరిచారు. వారు సైతం నిత్యం ఆ ట్రంకుపెట్టెలు, సూట్‌కేసులకు రోజూ అగరుబత్తీలు వెలిగించి,  కర్పూర హారతులు ఇచ్చి, పూజలు చేయడం మొదలెట్టారు. ఎన్నో అమావాస్యలు దాటాయి.. నెలలూ కరిగిపోయినా ఇంకా పూజల పేరిట మల్లిక దాటవేస్తుండటంపై అనుమానించారు. చివరకు ఓపిక నశించి ఏదైతే కానీలెమ్మని సూట్‌కేసులు, ట్రంకు పెట్టెలు తెరచి చూడాలని నిశ్చయించుకున్నారు. అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఎప్పటిలాగే వాటికి పూజలు చేశారు. పెట్టెల్లో నిధి ఏ రూపంలో కనిపిస్తుందోనని! తొలుత సూట్‌కేసులు ఉన్న ప్లాస్టిక్‌ గోనె సంచుల కుట్లను కత్తితో కట్‌ చేశారు. ఆ సంచుల నుంచి సూట్‌కేసులను జాగ్రత్తగా బయటకు తీశారు. తాళం తీసి చూశారు. అంతే! అందరి కళ్లూ బైర్లు కమ్మినట్లైంది. బంగారానికి బదులు పూజాసామగ్రి, దాని కింద ఐదు రూపాయల ఉప్పు ప్యాకెట్లు..ఆ తర్వాత రేషన్‌ బియ్యం..ఇటుకలు..ఇలా వన్‌ బై వన్‌ ఉండడం చూసి గొల్లుమన్నారు.

ఆ సూట్‌కేసులతో మల్లిక ఇంటికి పరుగులు తీశారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో ఆమె జంప్‌ అయ్యిందని తెలుసుకున్నారు. తమను నిలువునా మోసగించిందని గ్రహించారు. ఇది దావాలనంలా వ్యాపించడంతో మరికొందరు బాధితులు ఆందోళన చెందారు. ఇళ్లకు పరుగులు తీసి సూట్‌కేసులు తెరిచారు. ఈ పర్యాయం గగ్గోలు పెట్టడం వీరి వంతైంది!! బాధితులు కొందరు పోలీసులను ఆశ్రయించారు. మరికొందరు చెప్పుకుంటే పరువు పోతుందని కిమ్మనకుండా ఉన్నారు. కొందరు పోలీసులు కూడా బంగారు నిధికి ఆశపడి రూ.20లక్షల వరకూ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి పీలేరులో ఇది చర్చనీయాంశమైంది.

రూ.50లక్షలు ఇచ్చా
బంగారం ఇస్తానని చెప్పడంతో మేము కూడా  రూ.50 లక్షలు ఇచ్చాం. అత్యాశకు పోయి, అప్పులు చేసి నిండా మునిగిపోయాం. బంధువులందరి దగ్గర  అప్పు  చేసి ఇచ్చాం.  ఇప్పుడు  ఏమి చెయ్యాలో దిక్కుతోచడం లేదు. 
– క్రిష్ణారెడ్డి, గోరంట్లపల్లె

రూ.15లక్షలు ఇచ్చి మునిగా
నాకు రూ.3 కోట్ల విలువైన బంగారం ఇస్తానని చెప్పడంతో నా కుమారునికి తెలియకుండా బంగారం తాకట్టుపెట్టి,  కొంత అప్పులు చేసి రూ.15 లక్షలు ఇచ్చి నిండా మోసపోయా. పోలీసులు మాకు న్యాయం చేయాలి.
– సరస్వతమ్మ, పీలేరు 

చదవండి : భక్తులను రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement