భక్తులను రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం

TDP leaders Are Falsely Campaigning on TTD In Tirupati - Sakshi

పరాకాష్టకు అసత్య ప్రచారం

చంద్రబాబు హయాంలో ముద్రించిన పుస్తకాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తున్న వైనం

టీడీపీ తప్పు చేసి వైఎస్సార్‌సీపీపై నింద

మొన్న తిరుమల కొండల్లో చర్చి నిర్మాణమంటూ దుష్ప్రచారం

సాక్షి, తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీటీడీ ముద్రించి, వెబ్‌సైట్‌లో ఉంచిన భక్తి గీతామృత లహరి పుస్తకంలో అన్యమత ప్రస్తావన ఉందని ప్రచారం చేపట్టాయి. ఈ విషయాన్ని రెండు రోజులుగా టీడీపీ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చెయ్యడం ప్రారంభించింది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో జనంలో దూసుకుపోతుండడాన్ని టీడీపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఏదో రకంగా బురద చల్లడ మే లక్ష్యంగా అమరావతి, హైదరాబాద్‌ కేంద్రం గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తిరుమల, శ్రీశైలంలో అన్యమత ప్రచారం సాగుతోందని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం ముమ్మరం చేశాయి. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఇస్తున్న టికెట్ల వెనుక టీడీపీ హయాంలో ముద్రించిన అన్యమత విషయాలను తాజాగా తెరపైకి తెచ్చారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమేనని బట్టబయలు కావడంతో మరో రకంగా నిందలు వేయడం మొదలెట్టారు. ఆలయాల్లో అన్యమతస్తులను నియమించారని ప్రచారం చేశారు.

ఆ నియామకాలు కూడా టీడీపీ హయాంలో జరిగి నవేనని మరోసారి స్పష్టమైంది. మొన్నటికి మొన్న తిరుమలకొండపై చర్చి నిర్మించారంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పెట్టి విస్తృతంగా ప్రచారం చేశారు. వాస్తవంగా అది తిరుమల కొండల్లో అటవీ శాఖ ఫారెస్ట్‌ గార్డుల కోసం నిర్మించిన గది. ఆ పక్కనే సీసీ కెమెరా కోసం ఏర్పాటు చేసిన స్తంభం. వీటినే చర్చి అని, శిలువ అని టీడీపీ శ్రేణులు జోరుగా ప్రచారం చేశాయి. పోలీసులు రంగంలోని దిగి నిజాన్ని నిగ్గు తేల్చి తప్పుడు ప్రచారానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.


తిరుమలలో అన్యమత ప్రచారం చేయడానికి ఉపయోగించిన ఫొటోలను చూపుతున్న ఎస్పీ అన్బురాజన్‌ (ఫైల్‌) 

ఇన్నేళ్లు ఏం చేశారు?
హైందవ ప్రాశస్త్యాన్ని గురించి రచనలు చేసే ఆర్థిక స్థోమత లేని రచయితలకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని టీటీడీ 1979లో ప్రవేశపెట్టింది. పుస్తకం పూర్తిగా హైందవ వ్యవస్థకు సంబంధించి ఉండాలనేది నిబంధన. వీటిని పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ కూడా ఉంటుంది. అనంతరం రెండు దఫాలుగా రచయితకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ నేపథ్యంలో 2002లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కృష్ణయ్య టీటీడీ ఈఓగా ఉన్నప్పుడు చెన్నైకి చెందిన మెండే చిన్న సీతారామయ్య రచించిన ‘భక్తి గీతామృత లహరి’ పుస్తకాన్ని ఈ పథకం కింద ఎంపిక చేసి టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచారు.

అయితే ఇందులో అన్యమత ప్రస్తావన ఉందని సోమవారం సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. పుస్తకంలోని 182, 183, 184 పేజీల్లో ఏసుక్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన ఉండటాన్ని గమనించి వెంటనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. అప్పట్లో సముద్రాల లక్ష్మణయ్య, రామబ్రహ్మం, సత్యవతి, లక్ష్మణమూర్తి తదితరులతో కూడిన నిపుణుల కమిటీ ఈ పుస్తకాన్ని పరిశీలించిందని ప్రస్తుత ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే అప్పట్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పలేమని, తమ దృష్టికి రాగానే వెబ్‌సైట్‌ నుంచి తొలగించామన్నారు. పుస్తకాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, రెండు మూడు నెలల్లో ఈ పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top