ఎస్మాలకు తాము భయపడేది లేదని, సీమాంధ్ర జిల్లాల్లో సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.
ఎస్మాలకు తాము భయపడేది లేదని, సీమాంధ్ర జిల్లాల్లో సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా (ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) ప్రయోగించింది. ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెపై నిషేధం విధిస్తూ 238 జిఓ జారీ చేసింది. అయితే.. సమ్మెను యథాతథంగా కొనసాగిస్తాం తప్ప ఎస్మాలకు భయపడేది మాత్రం లేనే లేదని ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికుమార్ స్పష్టం చేశారు.
మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, అందువల్ల రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని విభజించవద్దని ఈనెల 13వ తేదీ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నో వర్క్ నో పే అమల్లోకి తెస్తూ ఈ ఉదయమే 177 జీఓను జారీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.