భర్త కోసం భార్య న్యాయ పోరాటం

Wife Protest in front of Husband House in visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తాళికట్టిన భార్యను, రక్తం పంచుకుపుట్టిన బిడ్డను ఓ ప్రబుద్ధుడు రైల్వేస్టేషన్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఆ బాధితురాలు శనివారం విశాఖ మహారాణిపేటలో భర్త ఇంటి వద్ద ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని బచేలిలో రైల్వేశాఖలో పని చేస్తున్న సందీప్‌కి ఏలూరు శాంతినగర్‌కు చెందిన జానకితో 2008లో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా  పెళ్లి సమయంలో జానకి తల్లిదండ్రులు భారీగా కట్నం కూడా ముట్టచెప్పారు. రైల్వే ఉద్యోగి అయిన సందీప్‌ విధుల్లో అలసత్వం కారణంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు..జానకిని కొట్టడం, మానసికంగా హింసించడంతో ఆమె తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోయింది. 

కుటుంబ కలహాలపై ఏలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం... ఆ తర్వాత ఇరు కుటుంబాలు కాంప్రమైజ్‌ కావడంతో గొడవలు సద్దుమణిగాయి. ఇటీవలే సందీప్‌ తిరిగి విధుల్లోకి చేరడంతో పాటు వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో జానకిని ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం.. భర్త వద్ద వదిలి వెళ్లారు. అయితే బచేలి నుంచి శుక్రవారం భార్య, కుమార్తెతో సహా విశాఖకు వచ్చిన సందీప్‌.. వారిని రైల్వేస్టేషన్‌లోనే వదిలి వెళ్లిపోయాడు. భర్త కోసం ఎంతసేపు చూసినా రాకపోవడంతో కుతూరితో కలిసి జానకి అత్తవారింటికి వెళ్లింది. అయితే ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా, ముఖం చాటేయడంతో ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, తనను పట్టించుకోవడం లేదంటూ... తనకు న్యాయం చేయాలంటూ మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top