అనుమానం పెనుభూతమై.. | wife killed by husband | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Feb 20 2015 3:20 AM | Updated on Sep 2 2017 9:35 PM

అనుమానం పెనుభూతమై..

అనుమానం పెనుభూతమై..

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కసి తీరా చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు...

అనుమానం పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. తల్లిదండ్రుల సంరక్షణలో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్నారులను అనాథలను చేసింది. జీవితాంతం తోడుంటానన్న భర్త పెళ్లినాటి బాసలు చెదిరిపోయాయి. నిండు నూరేళ్లూ కాపురం చేయాల్సిన భర్త.. అనుమానంతో భార్యను నరికి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుడ్లూరు మండలం స్వర్ణాజీపురం ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
 

- భార్యను గొంతు కోసి చంపిన భర్త
- ఆపై బావిలోకి దూకి  తానూ ఆత్మహత్య  
- స్వర్ణాజీపురం ఎస్సీ కాలనీలో ఘటన..

స్వర్ణాజీపురం (గుడ్లూరు) : కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కసి తీరా చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన మండలంలోని స్వర్ణాజీపురంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది. తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండగా ఆ చిన్నారుల అర్తనాదాలతో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. స్వర్ణాజీపురం గ్రామానికి చెందిన తాటితోటి ఏడుకొండలు(40)కు ఉలవపాడు మండలం వీరేపల్లికి చెందిన రమాదేవి(34)తో 14 ఏళ్ల క్రితం వివాహమైంది.

వీరికి నవీన్, వినయ్ అనే కుమారులతో పాటు ఇందు అనే కుమార్తె ఉంది. ఏడుకొండలు హైదరాబాదులో బేల్దారి పనులు చేసుకుంటూ అక్కడే కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలం పాటు బాగానే సాగిన వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్త ఏడుకొండలు మద్యానికి బానిసై భార్యను నిత్యం అనుమానించేవాడు. పెద్ద కుమారుడు నవీన్ గుడ్లూరులో హాస్టల్ ఉండి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె ఇందు అమ్మమ్మ వద్ద ఉంటూ ఏడో తరగతి ఉలవపాడు మోడల్ పాఠశాలలో చదువుతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఏడుకొండలు భార్యను ఇక్కడే వదిలేసి ఒక్కడే హైదరాబాద్ వెళ్లాడు. రమాదేవి గ్రామంలోనే పనులకు వెళ్తూ చిన్న కుమారుడిని చదివించుకుంటోంది.

ఏడుకొండలు 17వ తేదీ శివరాత్రి రోజు గ్రామానికి వచ్చాడు. బుధవారం రాత్రి భోజనాలు చేసిన అనంతరం ఏడుకొండలు, రమాదేవి, చిన్న కుమారుడు ఇంట్లో నిద్రపోగా ఏడుకొండలు తల్లి బయట వరండాలో పడుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఉన్మాదిగా మారిన ఏడుకొండలు కత్తితో గాఢ నిద్రలో ఉన్న రమాదేవిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రమాదేవి కేకలేస్తూ తలుపులు తీసుకొని బయటకు వచ్చి పడిపోయింది. కాలనీ వాసులు 108కి సమాచారం అందించి అప్పటికప్పుడు ఆటోలో కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ఆమెను 108లోకి మార్చారు.

పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో రమాదేవి మృతి చెందింది. ఇంట్లో నుంచి పారిపోయిన ఏడుకొండలు కాలనీకి చివర ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విజయ్‌చందర్ తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. తల్లిదండ్రులు లేని ముగ్గురు బిడ్డల అర్తనాదాలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని కందుకూరు డీఎస్పీ అజయ్‌ప్రసాద్, సీఐ లక్ష్మణ్‌లు గురువారం పరిశీలించారు. ఏడుకొండలు తల్లి కొండమ్మ, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మణ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement