‘రాజధాని’కి ఏమైంది? | What happen to the capital city | Sakshi
Sakshi News home page

‘రాజధాని’కి ఏమైంది?

Apr 28 2015 11:51 PM | Updated on Sep 3 2017 1:02 AM

మంత్రులు వచ్చినప్పుడే రాజధాని గ్రామాల్లో హడావుడి ఉంటోంది. మిగిలిన రోజుల్లో స్తబ్దత నెలకొంటుంది.

ముందుకు సాగని చెక్కుల పంపిణీ, గ్రామ కంఠాల గుర్తింపు,పొలాల చదును
జరీబు భూముల గుర్తింపుపై  రైతుల నుంచి అభ్యంతరాలు
ఆయా గ్రామాల్లో నేటికీ పూర్తికాని రుణమాఫీపైనా సందేహాలు
పూర్తి స్థాయిలో హాజరుకాని  సీఆర్‌డీఏ, సర్వే, రెవెన్యూ సిబ్బంది
మంత్రులు వస్తేనే పనులు,లేదంటే ఏసీ గదుల్లో అధికారులు

 
సాక్షి ప్రతినిధి, గుంటూరు : మంత్రులు వచ్చినప్పుడే రాజధాని గ్రామాల్లో హడావుడి ఉంటోంది. మిగిలిన రోజుల్లో  స్తబ్దత  నెలకొంటుంది. సీఆర్‌డీఏ, సర్వే, రెవెన్యూ శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో కార్యాలయాలకు హాజరుకాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రైతులకు చెక్కుల పంపిణీ, గ్రామ కంఠాల గుర్తింపు, పంట పొలాల చదును  వంటి కార్యక్రమాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 33,400 ఎకరాలను 23 వేల మంది రైతుల నుంచి సమీకరించింది.

ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం కౌలు చెక్కుల పంపిణీ కార్యక్రమం నెల కిందటే ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ కలసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో మంత్రులు కొన్ని రోజులు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి  హాజరుకాలేదు. దాంతో ఈ కార్యక్రమం మంద కొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు 4,500 ఎకరాలకు సంబంధించి రూ.2.08 కోట్ల మొత్తాల చెక్కులను పంపిణీ చేశారు.  అంగీకారపత్రాలు ఇచ్చిన రైతుల్లో కొందరు కౌలు చెక్కులు తీసుకొనేందుకు ముందుకు రావడం లేదు.

ఇళ్లు ఉంటాయా... పోతాయా ?

గ్రామ కంఠాల విషయంలో ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయి. నివాస గృహాలు ఉంటాయా? ప్రభుత్వం కూల్చివేస్తుందా? అనే సందేహాలతో రైతులు కొట్టుమి ట్టాడుతున్నారు. వీరి సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పిన మంత్రులు ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తం 29 గ్రామాలకు చెందిన గ్రామ కంఠాల్లో అనంతవరం, నెక్కల్లు గ్రామాలను మంత్రి నారాయణ పరిశీలించారే తప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించలేదు. రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన తరువాతే మిగిలిన భూముల్లో పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. ముందుగా వ్యవసాయ భూములను చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 

ఈ మేరకు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్టర్లతో పచ్చని పంట పొలాల సరిహద్దులను తొలగించారు. వారం రోజులపాటు జరిగిన ఈ తంతులో 8,600 ఎకరాలను చదును చేశామని మంత్రులు ప్రకటించినా, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై రైతులు సందేహ పడుతున్నారు. అసలు రాజధాని నిర్మాణం జరుగుతుందా? అనే అనుమానం కూడా లేకపోలేదు. మరోవైపు 5,982 ఎకరాల జరీబు భూముల గుర్తిం పుపైనా రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. వీటిపైనా ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు.

రాజధాని గ్రామాల్లోని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించిన తేదీలు అనేకసార్లు మారడంతో దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మంత్రులు ఉన్నప్పుడు ఉన్నతాధికారులు రాజధాని గ్రామాల్లో కనపడుతున్నారు. మిగిలిన రోజుల్లో సమీక్షల పేరుతో ఏసీ గదులను వదలడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement