పొరుగు రాష్ట్రాలేమంటాయో పట్టిసీమపై శ్రీరాం వెదిరె వ్యాఖ్య | what about patti seema project other states - sri ram | Sakshi
Sakshi News home page

పొరుగు రాష్ట్రాలేమంటాయో పట్టిసీమపై శ్రీరాం వెదిరె వ్యాఖ్య

Apr 17 2015 12:49 AM | Updated on Aug 20 2018 6:35 PM

పొరుగు రాష్ట్రాలేమంటాయో  పట్టిసీమపై శ్రీరాం వెదిరె వ్యాఖ్య - Sakshi

పొరుగు రాష్ట్రాలేమంటాయో పట్టిసీమపై శ్రీరాం వెదిరె వ్యాఖ్య

పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని...

న్యూఢిల్లీ: పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని, వరద నీరు వాడుకుంటామని తెలిపిందని కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె వెల్లడించారు. అయితే గోదావరి నుంచి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించినప్పుడు.. కృష్ణా బేసిన్‌కు పైనుంచి రావాల్సిన నీటిని పొరుగు రాష్ట్రాలు ఆపేస్తాయా? వాళ్లు ఎంతవరకు సమ్మతిస్తారు? ఇవన్నీ పరిశీలించాల్సి ఉంది..’ అని అన్నారు. ఇటీవల నదుల అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా నియమితులైన శ్రీరాం.. టాస్క్‌ఫోర్స్ కార్యాచరణ, విధివిధానాలు వివరించేందుకు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పట్టిసీమపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. దీన్ని నదుల అనుసంధానంలో భాగంగా చూడొచ్చునని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వాస్తవ రూపంలో ఆచరణ సాధ్యం కాదన్నారు. దానికి బదులు కాళేశ్వరం, కంతనపల్లి, మంథని, ఇచ్చంపల్లి, ఇలా నాలుగైదు చోట్ల బ్యారేజీలు నిర్మించడం ద్వారా ఒక సమీకృత ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

తద్వారా గోదావరి జలాలను తెలంగాణలోని పది జిల్లాలకు అందించవచ్చన్నారు. నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ పాత ప్రణాళికను సమీక్షించి, మార్పులు చేర్పులతో అమలుచేస్తుందని తెలిపారు. ‘వాజ్‌పేయి హయాంలో దాదాపు రూ. 4 లక్షల కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 30 లింకుల ద్వారా నదులు అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితి మారింది. కొన్ని ప్రాజెక్టులు వచ్చాయి. దీనికి ఇప్పుడు రూ. 12 లక్షల కోట్లవుతుందని ఒక ఎన్జీవో అంచనా వేసింది..’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అయ్యే వ్యయ అంచనా, సమగ్ర ప్రణాళిక, అమలు బాధ్యతలను టాస్క్‌ఫోర్స్ చూస్తుంది..’ అని వివరించారు. నదుల అనుసంధానం ద్వారా దాదాపు 3.5 కోట్ల ఎకరాలు సాగులోకి వస్తాయని, అలాగే 34 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement