అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశించారు. తన చాంబర్‌లో రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల అధికారులతో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ చర్యల పురోగతిపై మంగళవారం ఆయన సమీక్షించారు
కలెక్టరేట్(కాకినాడ), న్యూస్‌లైన్ : అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశించారు. తన చాంబర్‌లో రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల అధికారులతో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ చర్యల పురోగతిపై మంగళవారం ఆయన సమీక్షించారు. రక్షిత వనాలుగా గుర్తించిన బిళ్ళనందూరు బ్లాక్ (తుని, కోటనందూరు మండలాల్లో 757 ఎకరాలు), ఎస్.పైడిపాల (రౌతులపూడి మండలంలో 1,600 ఎకరాలు), బరువాక (శంఖవరం, ప్రత్తిపాడు మండలాల్లో 6,970 ఎకరాలు), అంగులూరు (దేవీపట్నం మండలంలో 10,785 ఎకరాలు), గిరిజనాపురం (ప్రత్తిపాడు మండలంలో 5,520 ఎకరాలు), డి.జగన్నాథపురం బ్లాక్ (తుని, కోటనందూరు, రౌతులపూడి మండలాల్లో 14,754 ఎకరాలు) బ్లాకులకు చెందిన అటవీ భూములు ఆక్రమణలకు గురవకుండా చూడాలని ఆదేశించారు.
ఐటీడీఏ నుంచి జీపీఎస్ శాటిలైట్ సర్వే పరికరాలు తీసుకుని హద్దుల నిర్ధారణకు నెల రోజుల్లో ప్రాథమిక సర్వే పూర్తి చేయాలని ఫారెస్ట్ రేంజి అధికారులకు సూచించారు. ఈ బ్లాకుల పరిధిలో అటవీ హక్కుల కల్పన చట్టం కింద అర్హులైన లబ్ధిదారులను కూడా గుర్తించాలని ముత్యాలరాజు అధికారులకు సూచించారు.