ముగిసిన ఓటరు నమోదు

Voter registration Compleat In Krishna - Sakshi

జిల్లాలో మొత్తం దరఖాస్తులు 2,47,815

ఫారం–6కు 2,25,669 మంది దరఖాస్తు

సమయం పొడిగించే అవకాశం లేదన్న అధికారులు

కృష్ణాజిల్లా, చిలకలపూడి(మచిలీపట్నం): సెప్టెంబరు 1 నుంచి అక్టోబర్‌31వ తేదీ వరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా 2,25,669 ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 30,51,122 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారు ఇంకా ఎంత మంది ఓటరుగా నమోదు చేసుకోవాలనే దానిపై కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం సిబ్బంది కసరత్తు ప్రారంభించారు.

గడవు పెంచాలి..
నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్లు, చేర్పించుకునే ప్రక్రియలో ఆయా పార్టీల నాయకులు కసరత్తు చేసినప్పటికీ ఎక్కువశాతం ఓట్లు నమోదు కాలేదు. సర్వర్‌ సమస్య, కొంత మంది రెవెన్యూ సిబ్బంది లిఖితపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయటం తదితర కారణాలతో పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియ జరగలేదనేది కొంత మంది పార్టీల నాయకుల ఆరోపణ. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను మరికొన్ని రోజులు పొడిగిస్తే పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు  జరుగుతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీనిపై గురువారం సాయంత్రం వరకు ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు.

ఆన్‌లైన్‌లో అవకాశం..
బుధవారం ఓటరు నమోదు కార్యక్రమం ముగిసినప్పటికీ ఇంకా నూతనంగా ఓటరుగా నమోదు చేసుకునే వారు ఫారం–6 ద్వారాఆన్‌లైన్‌లో దరఖాస్తును అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా ప్రస్తుతం ఓటరుగా నమోదయ్యేందుకు చేసుకున్న దరఖాస్తులు పరిశీలిస్తారా అనేది ఎన్నికల సంఘం నిర్ణయించాల్సి ఉంది.

త్వరలో ఇంటింటి పరిశీలన
ఎక్కువ మంది ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం సిస్టమేటిక్‌ ఓటరెడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోరల్‌ పార్టిసిపేషన్‌ (స్వీప్‌) ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇటీవల 4,66 స్వేర్‌ ఫీట్‌లో రంగోలి కార్యక్రమాన్ని కూడా జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా వ్యాప్తంగా పలు అంశాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఓటరు నమోదు, తొలగించటం, సవరణలు, పోలింగ్‌ కేంద్రాల మార్పులకు జిల్లా వ్యాప్తంగా 2,47,815 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను నవంబరు నెలలో ఇంటింటికి తిరిగి వాటిని పరిశీలించి ఎన్నికల సంఘానికి పంపటం జరుగుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top