రత్యేక ఓటరు నమోదు సవరణకు గడువు నేటితో ముగియనుంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటలకు తహశీల్దార్ కార్యాలయాలు, కళాశాలలు, ప్రత్యేక శిబిరాలలో ఓటు నమోదు చేసుకోవచ్చు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రత్యేక ఓటరు నమోదు సవరణకు గడువు నేటితో ముగియనుంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటలకు తహశీల్దార్ కార్యాలయాలు, కళాశాలలు, ప్రత్యేక శిబిరాలలో ఓటు నమోదు చేసుకోవచ్చు. బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండరు. వచ్చే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలంటే ఇప్పుడు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరముంది. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది.
గతనెల 24, ఈనెల 1,8,15 తేదీలను ప్రత్యేక దినాలుగా ప్రకటించి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట నిర్ణయించిన గడువు ఈ నెల 17న ముగిసినప్పటికీ.. యువత నుంచి అనూహ్య స్పందన రావడంతో ఎన్నికల సంఘం గడువును 23 వరకు పొడిగించింది. ఆదివారం వరకు బూత్‌లెవల్ అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 13 నియోజకవర్గాల్లోని 57 మండలాల్లో 3,326 పోలింగ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న యువత 1,65,994 మంది ఓటరు నమోదుకు అర్హులుగా ఉన్నారు. ఈనెల 21 వరకు 1,37,111 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,05,870 మంది దరఖాస్తులు సమర్పించగా, 32,241 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించడంలో యువత దానిపైనే ఆసక్తి చూపుతున్నారు. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోనూ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు ఇస్తూ నమోదు చేయిస్తున్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 21,717, రామగుండంలో 12,222, హుజూరాబాద్‌లో 8,927, సిరిసిల్లలో 7,825 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇంతకంటే తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా దరఖాస్తులను నమోదు చేసుకొని జనవరి 16న ఓటర్ల జాబితా అధికారికంగా ప్రకటిస్తారు. 26న ఓటర్లకు గుర్తింపుకార్డులు అందజేస్తారు.


