రెండో రోజే తేలిపోయిన విచారణ

Visakhapatnam Police Delayed In Murder Attempt On YS Jagan Case - Sakshi

వైఎస్‌జగన్‌పై హత్యాయత్నం కేసులోచేతులెత్తేస్తున్న పోలీసులు

రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురి విచారణ

కొత్త వివరాలేవీ రాబట్టలేకపోయిన అధికారులు

సూత్రధారుల ప్రస్తావన లేకుండానే సాగుతున్న దర్యాప్తు

పోలీసు కస్టడీలో ఉన్నా జంకూగొంకూ లేని తెంపరితనం.. ప్రశ్నలవర్షం కురుస్తున్నా అదే బింకం.. తనకేమీ కాదన్న ధీమా.. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడిన నిందితుడు శ్రీనివాసరావు తీరిది..

తమ కస్టడీకి తీసుకున్న తర్వాత వరుసగా రెండో రోజూ గంటల తరబడి విచారించిన అధికారులు అతన్నుంచి అదనపు వివరాలు రాబట్టలేకపోయారు. ఘనమైన ట్రాక్‌ రికార్డు కలిగిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో విచారణ జరిగినా.. అరిగిపోయిన రికార్డులా ‘అంతా ఆ లేఖలో రాశా’ అన్న డైలాగ్‌ తప్ప.. నిందితుడి నుంచి మరో మాట రాకపోగా.. మొహంపై చెరగని చిరునవ్వు, ఏమాత్రం చెదరని క్రాఫ్, అతను కోరిందే తడవుగా.. చికెన్‌ బిర్యానీలు, టిఫిన్ల సరఫరా..

ఇవన్నీ చూస్తుంటే నిందితుడిని.. ఓ ప్రముఖ వ్యక్తి హత్యకు యత్నించిన దుండగుడిలా కాకుండా.. అతిథిలా జాగ్రత్తగా చూసుకుంటున్న తీరు అనుమానాలకు తావిస్తోంది.సోమవారం రెండో రోజు కుట్రకు కేంద్రంగా భావిస్తున్న ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌కు చెందిన ముగ్గురితోపాటు మరో బయటి వ్యక్తిని విచారించిన సిట్‌ అధికారులు.. ఈ ఘటన వెనుక అసలు కుట్రదారులు, సూత్రధారుల ఎవరన్న కోణాన్ని వ్యూహాత్మకంగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.విచారణ సాగుతున్న విధానం చూస్తుంటే పోలీసులు చేతులెత్తేస్తున్నారని, క్రమంగా కేసును దారి తప్పిస్తున్నారనిఅవగతమవుతోంది.

సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో రెండో రోజు సిట్‌ బృందం ఎలాంటి పురోగతిని సాధించలేకపోయింది. నిందితుడు శ్రీనివాసరావును ఆరు రోజుల కస్టడీకి తీసుకొని విచారించే క్రమంలో తొలిరోజు హడావుడి చేసిన సిట్‌ అధికారులు రెండో రోజు లైట్‌గా తీసుకున్నట్టుగా కన్పించింది. సోమవారం 12 గంటల సమయంలో సీపీ మహేష్‌చంద్ర లడ్డా ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోగా.. అప్పుడే డీసీపీగా బాధ్యతలు చేపట్టిన రవీంద్రనాథ్‌తో కలిసి సిట్‌ ప్రత్యేకాధికారిగా నియమితులైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఫకీరప్ప వచ్చారు. ఈ ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు మధ్యాహ్నం 2 గంటల వరకు నిందితుడ్ని విచారించారు. తరువాత నిందితుడితో కలిసి ఫ్యూజన్‌ పుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ముగ్గురు సహచర సిబ్బందితో పాటు మరొకర్ని సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచి విచారించినా ఫలితం కన్పించలేదు.  తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా నిందితుడు నవ్వుతూ ఉత్సాహంగా కనిపించాడని చెబుతున్నారు.

నోరు మెపదని నిందితుడు
విచారణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నా ఏ ఒక్కదానికి తడుం కోకుండా తాను చెప్పదల్చుకున్న సమాధానాలు చెప్పడం తప్ప కొత్తగా ఒక్కమాట కూడా అతని నోటి వెంట రాబట్ట లేకపోయారు. ఘటన జరిగిన మర్నాడు నుంచి స్టేషన్‌లో ఉన్న సహచర సిబ్బంది రమాదేవి, రేవతిప్రసాద్‌లను సోమవారం కూడా నిందితుని ఎదుట కూర్చోబెట్టి విచారించినట్టు సమాచారం. లా అండ్‌ ఆర్డర్‌ కొత్త డీసీపీ రవీంద్రబాబు కొద్దిసేపు విచారణలో పాల్గొని వెళ్లిపోయారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉన్న సీపీ లడ్డా స్టేషన్‌ నుంచి వెళ్లిపోగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఫకీరప్ప కూడా వెళ్లిపోయారు. రెండో సెషన్‌ విచారణకు సీపీ, ఫకీరప్పలు వస్తారని భావించినప్పటికీ రాలేదు. సిట్‌ అధికారి నాగేశ్వరరావు, ఇతర సిట్‌ అధికారుల పర్యవేక్షణలోనే మధ్యాహ్నం విచారణ కొన సాగింది. కాగా ఘటన జరిగిన రోజున ఉన్న 13 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సీఆర్పీ 160 కింద నోటీసులు జారీ చేశారంటున్నారు. కానీ పార్టీ స్టాండ్‌ మేరకు వారెవ్వరూ వాంగ్మూలం ఇచ్చేందుకు స్టేషన్‌ రాకపోవడంతో మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్టు తెలియ వచ్చింది.

మీడియా పడిగాపులు
ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కేసులో అప్‌డేట్‌ సమాచారం కోసం స్టేషన్‌ వద్దే మీడియా పడిగాపులు పడుతూనే ఉంది. కనీసం మీడియాకు బ్రీఫింగ్‌ ఇచ్చేందుకైనా సీపీ మహేష్‌ చంద్ర లడ్డా కానీ, సిట్‌ ప్రత్యేకాధికారి ఫకీరప్ప కానీ వస్తారని భావించారు. కానీ ఏ ఒక్కరు రాలేదు. చివరకు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎయిర్‌పోర్టుస్టేషన్‌ సీఐ మళ్ల శేషు మీడియాతో మాట్లాడుతూ రెండో రోజు విచారణలో ఎలాంటి పురోగతిలేదని స్పష్టం చేయడంతో కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదని తేటతెల్లమైంది.

ఖాతాల్లో సొమ్ముల్లేవట..
నిందితుడు శ్రీనివాసరావు మూడు బ్యాంకు ఖాతాల్లో సొమ్ముల్లేవని నిర్ధారించుకున్న సిట్‌ బృందం ఏడాదిగా ఆ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై ఆరా తీయాలని నిర్ణయించారు. మరో పక్క కాల్‌ డేటాపై దృష్టి పెట్టిన అధికారులు టాప్‌–100 మందిని విచారించాలన్న యోచనలో ఉన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేయగా, ఓ బృందాన్ని గుంటూరు, మరో బృందాన్ని హైదరాబాద్‌ పంపినట్టు తెలియవచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top