అడ్డదారిలో ఐపీఎస్‌ ప్రతిపాదనలు! 

Vijayasai Reddy Letter To Governor Narasimhan - Sakshi

అడ్డుకోవాలని గవర్నర్‌కు ఎంపీ వి.విజయసాయిరెడ్డి వినతి

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయంగా వందిమాగధులుగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులకు అక్రమంగా సీనియారిటీ కల్పించడం ద్వారా ఐపీఎస్‌లుగా పోస్టింగ్‌లు ఇప్పించేందుకు జరుగుతున్న యత్నాలను అడ్డుకోవాలని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి గవర్నర్‌ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన గవర్నర్‌ కార్యదర్శికి ఓ లేఖ రాశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అందులో వివరాలు ఇవీ..

సీనియారిటీలను మార్చేసిన డీజీపీ ఠాకూర్‌ 
‘రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా కొందరు పోలీసు అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పించేందుకు అక్రమంగా ఒక జాబితా రూపొందించి కేంద్రానికి పంపుతున్నారు. డీఎస్సీల సీనియారిటీని నిర్థారించడానికి 2016లో రైల్వే ఏడీజీ కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఎంతో ప్రయాసకు ఓర్చి పకడ్బందీగా సీనియారిటీ జాబితాను రూపొందించి అభ్యంతరాల కోసం సర్క్యులేట్‌ చేసింది. జాబితాపై పెద్ద సంఖ్యలో అందిన అభ్యంతరాలు, నివేదనలను జాగ్రత్తగా పరిశీలించి పూర్తిగా న్యాయబద్ధమైన రీతిలో సీనియారిటీ తుది జాబితాను తయారు చేసింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ జాబితాలోని డీఎస్సీల సీనియారిటీని ఛిన్నాభిన్నం చేశారు. కొందరికి అక్రమంగా ఐపీఎస్‌ పోస్టింగ్‌ వచ్చేందుకు వీలుగా సీనియారిటీలను మార్చేశారు. 2007లో రాష్ట్రంలో 140 డీఎస్పీ పోస్టులను అదనంగా మంజూరు చేయగా 2010లో వీటిని ఆయా శాఖలకు కేటాయిస్తూ జీవో వచ్చింది. ఈ పోస్టులను కిషోర్‌ కుమార్‌ కమిటీ తాజా జాబితాకు జత చేసింది. అయితే ఆర్పీ ఠాకూర్‌ ఈ జాబితాను  ఏకపక్షంగా విస్మరించి కొందరు అధికారులకు మేలు చేసేందుకు కొత్త సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. రాజకీయ ఒత్తిళ్ల మేరకే ఈ అక్రమాలన్నీ జరిగాయి. 

అక్రమాలకు ఇవిగో ఉదాహరణలు...
1984 బ్యాచ్‌ ఎస్‌ఐ ర్యాంకు అధికారి ఏ.వెంకటరత్నం డీఎస్పీగా పదోన్నతి పొందిన తేదీని తప్పుగా పేర్కొంటూ రహస్య జీవో జారీ చేశారు. 1984 బ్యాచ్‌కే చెందిన మరో ఎస్‌ఐ డొక్కా కోటేశ్వరరావు విషయంలో కూడా ఇలాగే జరిగింది. సీనియారిటీ ప్రకారం ఈ అధికారి 2007 బ్యాచ్‌ కన్నా దిగువన ఉంటే ఆయన ఐపీఎస్‌ పదోన్నతికి అర్హుడయ్యేలా సీనియారిటీని సవరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఆరోపణలు రుజువైన పలువురు అధికారులకు కూడా ఇలాగే పదోన్నతులకు వీలుగా జాబితాలు తయారు చేశారు. ఏఆర్‌ దామోదర్‌ అనే 2007 డైరెక్ట్‌ రిక్రూట్‌ అధికారి పనితీరు 2009 నాటికి ‘పూర్‌’ అని ఉంటే దాన్ని పూర్తిగా సవరించి తాజాగా ‘ఔట్‌ స్టాండింగ్‌’ అని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్‌ 25వ తేదీన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఈ అధికారి పాత్ర ప్రస్తావనార్హం. విశాఖలో డీసీపీ (క్రైమ్స్‌)గా ఉన్న ఈ అధికారి ముఖ్యమంత్రికి బంధువు కూడా. 2018 ఆగస్టులో ఈ అధికారి అమెరికా పర్యటనకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అన్ని అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఈ అధికారి సినీనటుడు శివాజీని అమెరికాలో కలుసుకుని వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పథకం పన్నారని అధికార వర్గాలు చర్చించుకోవడం అందరికీ తెలిసిందే. ఇలాంటి అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి ఇప్పించుకోవడం ద్వారా కేంద్ర సంస్థలైన సీబీఐ, ఐబీలలో నియమించుకునే యత్నాలను నిరోధించాలని గవర్నర్‌ను కోరుతున్నాం.

జాబితాను తనిఖీ చేయించాలి...
అవినీతి, ఇతర ఆరోపణలున్న రామ్‌ప్రసాద్, రెడ్డి గంగాధర్, ఏఆర్‌ రాధిక తదితరులకు అనుకూలంగా రహస్య జీవోల ద్వారా క్లీన్‌ చిట్‌ ఇచ్చి ఐపీఎస్‌లుగా ప్రమోషన్లు ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవకతవకలమయం అయిన సీనియారిటీ జాబితాపై, అనుకూల అధికారులకు ఐపీఎస్‌లుగా ప్రమోషన్లు ఇప్పించుకునే యత్నాలపై కోర్టులు, క్యాట్‌లలో వివాదాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్షణం గవర్నర్‌ జోక్యం చేసుకుని ఐపీఎస్‌ పదోన్నతి జాబితాను తనిఖీ చేయించాలి. అవసరమైతే ఓ సాధికార కమిటీని నియమించి క్షుణ్నంగా పరిశీలించాలి. లొసుగులను సవరించి న్యాయబద్ధమైన రీతిలో సీనియారిటీ జాబితాను రూపొందించిన తరువాతే కేంద్రానికి పంపాలి’ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top