‘ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్‌ గరుడ శివాజీ ఎక్కడున్నా రండి’

Vijaya sai reddy setyres on Raviprakash Shivaji - Sakshi

సాక్షి, అమరావతి : ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్‌ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి.. మిమ్మల్నేమీ అనరు అంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, నటుడు శివాజీలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి సెటైర్‌ వేశారు. 'మెరుగైన సమాజం కోసం ఫోర్జరీ ఎలా చేయాలనే సలహాలు మాత్రమే పెకాశం గారిని అడుగుతారట.. శివాజీ కోసం స్టేషన్‌లో వైట్‌ బోర్డు, మార్కర్‌ పెన్ను సిద్ధంగా ఉంది.. ఫోర్జరీ పురాణం చెప్తే చాలట' అంటూ సైరా పంచ్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ పెట్టారు. తనకు కులం లేదు, మతం లేదంటూనే సొంత సామాజిక వర్గానికే ప్రమోషన్లలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మరో సైరా పంచ్‌ వేశారు.
 

తను చేయించిన 4 సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని తేలినట్టు చెప్పిన చంద్రబాబు నాయుడు, ఎగ్జిట్ పోల్స్‌ను మాత్రం నమ్మొద్దనడం వింతగా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మీడియా ఇంతగా విస్తరించిన తర్వాత దేన్ని నమ్మొచ్చో దేన్ని పట్టించుకోకూడదో ప్రజలందరికీ తెలుసని ట్విటర్‌లో మరో పోస్ట్‌ పెట్టారు.

చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం కావడంతో పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్‌ జోక్యం చేసుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మాఫియాను నియత్రించాలని డిమాండ్‌ చేశారు.

పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయొద్దని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి చరిత్ర పురుషుడయ్యారని కొనియాడారు. చంద్రబాబు మాత్రం నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును ఏటీఏమ్‌లా మార్చుకుని వేల కోట్లు మింగారని ధ్వజమెత్తారు.

ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి ఆయనను  కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ? అంటూ తూర్పారబట్టారు. చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్‌లో ఎదిగిన తీరు గమనిస్తే రవిప్రకాశ్‌ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్‌ మెయిల్‌ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యమని ధ్వజమెత్తారు. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోందని పోస్ట్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top