‘అమృత్‌’పై విజిలెన్స్‌ | Vigilance Raids On Amruth Scheme Kurnool | Sakshi
Sakshi News home page

‘అమృత్‌’పై విజిలెన్స్‌

Jul 2 2018 12:36 PM | Updated on Jul 2 2018 12:36 PM

Vigilance Raids On Amruth Scheme Kurnool - Sakshi

కర్నూలు గురురాఘవేంద్ర నగర్‌లో పైపులైన్‌ కోసం ఇళ్ల ముందు తవ్వి వదిలేసిన గుంత

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం ఉచిత కుళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు ఉద్దేశించిన అమృత్‌ పథకం అమలు తీరుపై విచారణ ప్రారంభం కానుంది. ఈ పథకం అమలులో భారీగా అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో పనుల వివరాలు ఇవ్వాలంటూ నగర పాలక సంస్థకు విజిలెన్స్‌ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ మొత్తం వివరాల ఆధారంగా  అవకతవకలను గుర్తించే పనిలో విజిలెన్స్‌ అధికారులు ఉన్నట్టు సమాచారం. ఈ పథకాన్ని 2016 నవంబరు 5నప్రారంభించారు. మొత్తం రూ.58.25 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో పైపులైన్‌ వేయడం మొదలుకుని..ఉచితంగా ఇవ్వాల్సిన కుళాయి కనెక్షన్‌ కోసం డబ్బు వసూలు చేయడం వరకూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థను కాదని అధికార పార్టీ నేత చెప్పిన వారికే సబ్‌ కాంట్రాక్టు అప్పగించడం వల్ల పనులు నాసిరకంగా జరిగాయనే విమర్శలున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ నేతలు చేసిన నీరు–చెట్టు పనులపై విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అమృత్‌ పథకంపై విచారణలోనూ ఏయే నిజాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది. 

అడుగుకు మించి తవ్వరే!
కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 51 డివిజన్లు ఉన్నాయి. ఇందులో కర్నూలు నియోజకవర్గంలో 35, పాణ్యం 13, కోడుమూరు నియోజకవర్గ పరిధిలో 3 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో లక్షా 10 వేల ఇళ్లు ఉన్నాయి. కుళాయి కనెక్షన్లు మాత్రం  48 వేలే ఉన్నాయి. దీంతో మిగిలిన వారందరికీ ఉచితంగా కుళాయి కనెక్షన్లు మంజూరు చేసి..మంచినీరు అందించాలనేదే అమృత్‌ పథక ఉద్దేశం. అయితే, ఈ ఉద్దేశాన్ని అధికార పార్టీ కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. మొత్తం రూ.58.25 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో వినియోగించిన పైపులు కూడా నాసిరకంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. టెండర్‌ నిబంధనల ప్రకారం పైపులైన్‌ అడుగున్నర లోతులో వేయాలి. పైపులైన్‌ కింద శాండ్‌ బెడ్‌  కూడా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం అడుగు లోతు కూడా తవ్వకుండానే పైపైన మట్టి తీశారు. శాండ్‌బెడ్‌ లేకుండానే పైపులైను వేశారనే ఆరోపణలున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేస్తే కూడా పైపులైన్లు పగిలిపోయి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక పైపులైన్‌ కోసం రోడ్డును తవ్విన ప్రాంతాల్లో తిరిగి గుంతలు పూడ్చలేదు.

ఇష్టానుసారం చేశారు
మా ఇంటి (డోర్‌ నంబర్‌ : 339–1 ఏ) వద్ద అమృత్‌ స్కీమ్‌ కింద పైపులైన్‌ పనులు చేపట్టారు. అధ్వానంగా, ఇష్టానుసారంగా  చేశారు. గుంతలు తవ్వి అలానే వదిలేశారు. వీటిని పూడ్చాలని మునిసిపల్‌ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడ పనులు పూర్తి చేస్తే కుళాయి కనెక్షన్‌ తీసుకోవచ్చు. అయితే.. మా కాలనీలో ఇళ్లు లేని చోట పైపులైన్‌ వేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ దుస్థితి.   – నారాయణ, సొసైటీ కాలనీ,28వ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement