ఉత్సాహంగా మారథాన్‌

Ultra Marathon in Anantapur - Sakshi

భారీగా తరలివచ్చిన స్పెయిన్‌ దేశస్తులు

మారథాన్‌ను ప్రారంభించిన అన్నేఫెర్రర్‌   

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఆర్డీడీ నిర్వహిస్తున్న అల్ట్రా మారథాన్‌ ఓడీచెరువు మండలం సుందరయ్య కాలనీ వద్ద గురువారం  ప్రారంభమైంది. మారథాన్‌లో స్పెయిన్‌ దేశస్తులు, ‘అనంత’ క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.  

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆర్డీడీ ఆధ్వర్యంలో నాలుగో అల్ట్రా మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. గురువారం ఓడీచెరువు మండలం సుందరయ్య కాలనీ వద్ద ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నే ఫెర్రర్‌  ప్రొగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్, చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డితో కలిసి మారథాన్‌ను ప్రారంభించారు. ‘ఒక కిలోమీటర్‌ ఒక జీవితం’ అనే నినాదంతో ప్రారంభమైన మార«థాన్‌కు స్పెయిన్‌ దేశస్తులు, అనంతకు చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదట సుందరయ్య కాలనీలో మారథన్‌ పరుగు శిలాఫలకాన్ని ఆన్నేఫెర్రర్,  మాంఛోఫెర్రర్‌  ప్రారంభించారు.   

పేదలకు గృహాలను అందించేందుకే పరుగు  
సుందరయ్య కాలనీలో నివాసముండే పేదలకు గృహ నిర్మాణాలకు సంబంధించి నిధుల సేకరణ కోసం మారథాన్‌ రన్‌ను నిర్వహిస్తున్నట్లు మాంఛోఫెర్రర్‌ తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి ఆవరణలోని ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ సమాధి వరకు రన్‌ కొనసాగుతుందన్నారు.  ఒక కిలో మీటర్‌ పరుగు ఒక జీవితాన్ని బాగుచేస్తుందనే నినాదంతో  కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆర్డీటీ స్థాపించి శుక్రవారం నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. రన్‌ డైరెక్టర్‌ జువాన్‌ మ్యాన్యువల్‌ మాట్లాడుతూ రన్‌ ఓడీ చెరువు మండలం సుందరయ్యకాలనీ,  తాటిమేకల పల్లి, చెవిటివారి పల్లి, బనియాన్‌చెరువు, మేకల చెరువు, వాయకట్ల దేవుల చెరువు, పులిగాండ్లపల్లి, తలుపుల, బట్రేపల్లి, గొందిపల్లి, తపటవారిపల్లి, తిమ్మనాయుని పాలెం, ఇందుకూరు, బూదనాంపల్లి, మర్రిమేకలపల్లి, తాడిమర్రి మీదుగా బత్తలపల్లికి చేరుకుంటుందన్నారు. ప్రతి పది కిలో మీట్లకు ఒక జట్టు రన్‌ చేస్తుందని,  శుక్రవారం మధ్యాహ్నం పరుగు ముగుస్తుందని చెప్పారు. సుమారు 150 మంది స్పెయిన్‌ దేశస్తులు ఉత్సాహంగా పరిగెత్తారు. ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపుల భారీగా విద్యార్థులు, ప్రజలు చప్పట్ల ద్వారా స్వాగతం పలికారు.  కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్‌ తిప్పేస్వామి,  డైరెక్టర్లు షీబా, సాయికృష్ణ,  చంద్రశేఖర్‌నాయుడు, నాగేశ్వర్‌రెడ్డి, కృష్ణవేణి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top