తీవ్ర ఘర్షణగా మారిన బస్సు సీటు వివాదం

Two People Fight Over Bus Seat - Sakshi

బస్సును అడ్డుకున్న నిందితుడి అనుచరులు

నలుగురిపై సుమారు 40 మంది దాడి

బీరు బాటిళ్లతో వీరంగం గుంటూరులో ఘటన

గుంటూరు ఈస్ట్‌ : ప్రయాణ సమయంలో ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో ఏర్పడిన చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఎదుటి వారితో గొడవ పడ్డ వ్యక్తి ఫోన్‌లో తన అనుచరులను పెద్ద సంఖ్యలో పిలిపించి బీరు బాటిళ్లతో దాడి చేయించడంతో ఆ ప్రాంతంలో అలజడి రేగింది. సమీపంలోని వైన్‌ షాపు సిబ్బంది బాధితులను షాపులోకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు సకాలంలో రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.  పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని పాపరాజుతోటకు చెందిన కర్పూరపు శివకుమార్, ఆయన భార్య సుష్మ, వారి సమీప బంధువులు మరో ఇద్దరు కలిసి గుంటూరు వచ్చేందుకు పర్చూరులో బస్సు ఎక్కారు.

గుంటూరులోని శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డుకు చెందిన ముస్తఫా అదే బస్సు ఎక్కి తాను కూర్చున్న పక్క సీటులో కుమారుడిని పడుకోబెట్టాడు. ముస్తఫాను శివకుమార్‌ పరిచయం చేసుకుని బాలుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తాను సీటులో కూర్చుంటానని కోరాడు. ముస్తఫా అందుకు నిరాకరించాడు. ఈ విషయమై ఇద్దరు గొడవపడ్డారు. అనంతరం ముస్తఫా గుంటూరులోని తన అనుచరులకు ఫోన్‌ చేసి నల్లచెరువు మూడు బొమ్మలసెంటర్‌ వద్దకు రావాలని కోరాడు. దీంతో భయపడిన శివకుమార్‌ దంపతులు, వారి బంధువులు వెనక్కు తగ్గారు.

అయితే బస్సు నల్లచెరువు మూడు బొమ్మలసెంటరుకు చేరుకోగానే ముస్తఫా అనుచరులు సుమారు 40 మంది బస్సును అడ్డగించారు. బస్సులో ఉన్న శివకుమార్‌ దంపతులను, వారి బంధువులు మొత్తం నలుగురిని కిందకు దించి తీవ్రంగా కొట్టారు. కొందరు పగిలిన బీరు బాటిళ్లతో దాడి చేశారు. ఈ దాడిని చూసిన సమీపంలోని పూర్ణ వైన్స్‌ సిబ్బంది నలుగురిని కాపాడి వైన్‌ షాపులోకి తీసుకెళ్లి దాచిపెట్టారు. అప్పటికి నిందితులు షాపులో ఉన్నవారిని చంపేస్తామంటూ లోనికి ప్రవేశించేందుకు తీవ్రయత్నం చేశారు. నిందితుల అరుపులు, కేకలతో బాధితులు ప్రాణభయంతో వణికిపోయారు. పోలీసులు సకాలంలో సంఘటనాస్థలానికి వెళ్లి దాడి చేస్తున్నవారిని అడ్డుకోవడంతో బాధితులకు ప్రాణాపాయం తప్పింది. ముస్తఫా మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top