కొండపల్లిలో రెండు బస్సులు ఢీ | Two buses collided in Kondapalli | Sakshi
Sakshi News home page

కొండపల్లిలో రెండు బస్సులు ఢీ

May 17 2015 2:28 AM | Updated on Sep 3 2017 2:10 AM

కొండపల్లిలో రెండు బస్సులు ఢీ

కొండపల్లిలో రెండు బస్సులు ఢీ

ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటనలో 16మంది గాయపడగా ఒక మహిళ మృతి చెందారు.

మహిళ మృతి 16 మందికి గాయాలు
చెత్త తగులబెట్టిన పొగ వల్లే ప్రమాదం
మృతురాలి కుటుంబానికి
రూ.లక్ష ఆర్థికసాయం

 
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటనలో 16మంది గాయపడగా ఒక మహిళ మృతి చెందారు. కొండపల్లి జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈఘటన జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం తిరువూరు ఆర్టీసీ డిపోకు చెందిన అద్దెబస్సు విజయవాడ నుంచి తిరువూరు వెళ్తుంది. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన 350 సర్వీసు నంబరు బస్సు మైలవరం నుంచి విజయవాడ వస్తుండగా కొండపల్లి వద్దకు వచ్చేసరికి రెండుబస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈసంఘటనలో 350 సర్వీసు బస్సు ఎదురుభాగం నుంచి 10అడుగుల దూరం పూర్తిగా ధ్వంసమైంది. రెండు బస్సుల్లో సుమారు 80 మంది ప్రయాణిస్తుండగా 16మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన డ్రైవర్ ప్రకాష్‌కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.పోలీసులు, స్థానికులు ఆప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను 108వాహనంలో విజయవాడకు తరలించారు. మార్గం మధ్యలో 350బస్సులో ప్రయాణిస్తున్న ఉండవల్లికి చెందిన వై.లక్ష్మి(38) మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. స్వల్ప గాయాలైన ప్రయాణికులను స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు పంపారు. ఈప్రమాదానికి రహదారి పక్కన ఉన్న పంచాయతీ డంపింగ్ యార్డు నుంచి దట్టంగా వెలువడుతున్న పొగే కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది డంపింగ్ యార్డులో మండుతున్న మంటలను ఆర్పేశారు. క్రేన్‌ల సహాయంతో ఢీకొన్న వాహనాలను వేరుచేశారు. సహాయక చర్యల్లో ఎస్‌ఐలు కృష్ణ, గణేష్, యువకుమార్ పాల్గొన్నారు.
 
16మందికి వైద్య సేవలు

కొండపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటనలో గాయపడిన 16మందికి వైద్యసహాయం అందిస్తున్నామని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వై.సురేష్‌బాబు తెలిపారు. గాయపడిన పాతపాడుకు చెందిన లక్ష్మీ(26), తేజ(7), రాణి(36), నర్శమ్మ(70), యశ్వంత్(5), ప్రకాష్(డ్రైవర్), రాజారావు(డ్రైవర్) మరో ఇద్దరితో కలిపి 9మంది ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారిని తెలిపారు. కొండపల్లి ప్రైవేట్ వైద్యశాలలో మరో  ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఉండవల్లి గ్రామానికి చెందిన వై.లక్ష్మి మృతి చెందారని, ఆమె కుటుంబ సభ్యులకు  రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తామన్నారు. ఆర్టీసీ ఎండీ ఉత్తర్వుల మేరకు ఈ సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement