నల్లమలలో అలజడి | Twitter in Nallamala forest | Sakshi
Sakshi News home page

నల్లమలలో అలజడి

Jun 20 2014 12:10 AM | Updated on Aug 24 2018 2:33 PM

నల్లమల అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం సతకోడు గ్రామ శివారుల్లో గురువారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.

అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు
గురువారం జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో
భారీ కూంబింగ్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురుమవోయిస్టులు మృతి..!
గాయాలతో తప్పించుకున్న విక్రమ్ కోసం గాలింపు ముమ్మరం
అప్రమత్తమైన గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు
హడలిపోతున్నజాప్రతి నిధులు,రాజకీయ నాయకులు

 
గుంటూరు : నల్లమల అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం సతకోడు గ్రామ శివారుల్లో గురువారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కమిటీ సభ్యుడు జాన్ బాబూరావుతోపాటు విమల, భారతి అలియాస్ నిర్మల అనే ముగ్గురు మావోయిస్ట్‌లు మృతిచెందారు. పదేళ్ల తర్వాత గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్ కావడంతో మావోయిస్ట్‌లకు పోలీసులు పెద్ద దెబ్బ కొట్టినట్లేనని చెప్పవచ్చు. కొంత కాలంగా నల్లమలలో మావోయిస్ట్‌ల కదలికలు ప్రారంభమయ్యాయనే వదంతులను పోలీసు ఉన్నతాధికారులు కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ నెల 9వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘నల్లమలలో మావోయిస్ట్ కదలికలు’ అనే కథనం ప్రచురితమయింది. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌తో ‘సాక్షి’ కథనం అక్షరాల నిజమయింది. ఈ నెల 8వ తేదీన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సభలో సైతం పోలీసులు మావోయిస్ట్‌ల ఫొటోలతో కూడిన బ్యానర్‌లు పెట్టడం ఇందుకు నిదర్శనం. గుంటూరు పోలీసులు నల్లమల అటవీప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా బోర్డర్‌లో గురువారం మావోయిస్ట్‌లు అకస్మాత్తుగా తారసపడి పోలీసులపై ఎదురు కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన పోలీసులు కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు.  

రిక్రూట్‌మెంట్ నేపథ్యంలోనే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీమాంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోవడంతో ఇదే అదునుగా భావించిన మావోయిస్టులు నల్లమల ప్రాంతాన్నిషెల్టర్ జోన్‌గా మలుచుకుని తిరిగి రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో యువతను ఆకర్షించి తమవైపునకు తిప్పుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఇంటిలిజెన్స్ సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 2004కు ముందు జిల్లాలో వీరి కార్యకలాపాలు యథేచ్చగా సాగేవి. అప్పటి ప్రభుత్వం అనేక మంది మావోయిస్టులను, సానుభూతి పరులను లొంగిపోయేలా చేసి, వారికి జీవన భృతి కల్పించి జన జీవన స్రవంతిలో కలిసే అవకాశం కల్పించారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వె ళ్లిన కొందరు మావోయిస్టులు తిరిగి తమ ఉనికిని కాపాడుకునేందుకు రిక్రూట్‌మెంట్‌ను కొనసాగించే ప్రయత్నాలు ప్రారంభించిన క్రమంలో ఎన్‌కౌంటర్ జరగడంతో ఈ ప్రాంతంలో మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.

భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు

నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన సంఘటనలో తీవ్ర గాయాలతో తప్పించుకున్న మావోయిస్ట్ విక్రమ్‌గా అనుమానిస్తున్నారు. అతని కోసం పోలీసులు భారీగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలోని ఎస్పీలు అప్రమత్తమై సాయుధ బలగాల ద్వారా నల్లమలను జల్లెడపట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోలతోపాటు తప్పించుకున్న మావోయిస్ట్‌కు నల్లమల అటవీ ప్రాంతంలో అణువణువూ కొట్టినపిండి లాంటిది కావడంతో ఎటు నుంచి ఏ జిల్లాలోకి ప్రవేశిస్తారో ఎవ్వరికీ అంతుబట్టని పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు కూంబింగ్ పార్టీ పోలీసుల నుంచి వీరంతా త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మావోయిస్టు ప్రభావిత గ్రామాలు మావోల కదలికలు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో నిత్యం కంటిపై కనుకు లేకుండా ఉండేవి. తాజా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని తెలుసుకుని ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న ఈ గ్రామాల్లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. మావోయిస్ట్ ప్రభావిత గ్రామా ల్లో ఉండే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం హడలిపోతున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement