టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలి

TRSMA Demands Promote to SSC Students With Internal Marks - Sakshi

కవాడిగూడ: రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో  టెన్త్‌ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని   తెలంగాణ రికగ్నైజ్‌ స్కూల్స్‌ మేనేజిమెంట్‌ అసోసియేషన్‌ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.  పదవ తరగతి పరీక్షలు రద్దుచేసి ఆన్‌లైన్‌లో అందజేసిన ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించి పై తరగతులకు అనుమతించాలని కోరారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఇప్పటికే రెండు, మూడుసార్లు పరీక్షలు వాయిదా పడటం వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురై పరీక్షలు రాయాలనే సంసిసద్ధతను కోల్పోయారన్నారు. కరోనా నేపధ్యంలో ఇప్పటికే పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం, మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షలు రద్దుచేసి పైతరగతులకు ప్రమోట్‌ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకొని పదవ తరగతి విద్యార్థులను పై తరగతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు జలజం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎన్‌. రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్, నాయకులు రాంచంద్రారెడ్డి, రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top