ప్రాణాలతో చెలగాటం !

Transport Department Negligance On Private Travels Krishna - Sakshi

స్టేజీ క్యారియర్‌గా ఒక్క బస్సుకూ అనుమతి లేదు

రవాణా కమిషన్‌ కార్యాలయం ముందు నుంచే వందల సంఖ్యలో వెళ్తున్న బస్సులు

ఆర్టీసీ బస్టాండ్‌ వెలుపల ప్రైవేటు బస్సుల దందా

అయినా పట్టించుకోని అధికారులు

నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులు

చేష్టలుడిగి చూస్తున్న రవాణా శాఖాధికారులు

ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలకు రాష్ట్ర రాజధాని నగరం విజయవాడ నుంచి ప్రయాణికులను చేరవేసేందుకు   అనుమతులు తీసుకుంటున్న యాజమాన్యాలు ఆ తరువాత నిబంధనలు పాటించకుండా బస్సులను తిప్పుతూ  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రైవేటు బస్సుల తీరు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా రవాణా శాఖ అధికారులు  చర్యలు తీసుకోకపోవడం వెనుక ‘మామూళ్లే’ కారణమన్న ఆరోపణలున్నాయి.

సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌కు కూతవేటు దూరంలోనే ఈ బస్సుల స్టేజీలు ఉన్నా.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు బస్టాండుకు వస్తున్న ప్రయాణికులను పిలిచి మరీ ప్రైవేటు బస్సుల్లో ఎక్కించుకుంటున్నా అధికారులు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉంది. స్టేజీ క్యారియర్‌గా ఒక్క బస్సుకూ అనుమతి లేకుండా నిత్యం వందలాది బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తిరుగుతున్నా చేష్టలుడిగి చూడటం రవాణా శాఖ అధికారులకే చెల్లింది.

ఒక్క బస్సుకూ అనుమతి లేదు..
రాజధాని ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రతి రోజూ రాష్ట్రంతోపాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితరాల ప్రాంతాలకు 750 బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వీటిలో ఒక్క బస్సుకూ స్టేజీ క్యారియర్‌ అనుమతి లేదు. అయినా ఆ బస్సులు నిత్యం రోడ్లపై తిరుగుతున్నాయి. దీనిని అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం రవాణాశాఖలో 530 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు బస్సులు 225 వరకు ఉన్నాయి. వీటిలో 13 జిల్లాల్లో తిరిగేందుకు పర్మిట్లు ఉన్నవి 108, జాతీయ పర్మిట్లు కలిగినవి 117 ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 150 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. మిగిలిన బస్సులు అనంతపురం, కడప, తిరుపతి నగరాల నుంచి తిరుగుతున్నాయి.

పండిట్‌ నెహ్రూ బస్టాండే అడ్డాగా...
విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ను అడ్డాగా చేసుకుని ప్రైవేటు బస్సులు దందా సాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లేందుకు వస్తున్న ప్రయాణికులను ఆయా ప్రైవేటు బస్సుల సహాయ సిబ్బంది ప్రయాణికులను దారి మళ్లిస్తున్నారు. బస్టాండుకు కూతవేటు దూరంలోనే ఈ తతంగమంతా జరుగుతున్నా అటు ఆర్టీసీ అధికారులు కానీ, ఇటు రవాణా శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు కూడా పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిష్ట వేసి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఇస్తున్న నెలావారీ మామూళ్లకు అలవాటు పడే రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?
గత ఏడాది మార్చి నెల 1వ తేదీన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద జరిగిన ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో రవాణాశాఖలో పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపై కృష్ణా డీటీసీ కార్యాలయం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని నాని, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్యే బుద్దా వెంకన్నలు.. రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేసినంత పనిచేశారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని ఇరువురికి రాజీ చేయాల్సి వచ్చింది. సోమవారం రోజూ జగ్గయ్యపేట సమీపంలోనే మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మూడు బస్సులు, ఒక కారు ఢీ కొన్న సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. లేదంటే భారీ ప్రాణ నష్టం సంభవించేది. ఎదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేసే అధికారులు అనుమతి లేని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తదని ప్రయాణికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top