అష్టదిగ్బంధనంలో సిక్కోలు

Traffic Rules In Srikakulam - Sakshi

శ్రీకాకుళం సిటీ : నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలపై జిల్లాస్థాయి అధికారులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ట్రాఫిక్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడుతున్నారు. మరోవైపు రోడ్డును ఆనుకుని ఉన్న షాపులు, దుకాణాల తొలగింపు చర్యలు చేపడుతున్నారు. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేడ్కర్‌ కూడలి, డే అండ్‌ నైట్‌ కూడలి, ఆర్ట్స్‌ కళాశాల రోడ్డు నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ముందస్తు సమాచారం ఇవ్వని అధికారులు అంబేడ్కర్‌ కూడలి వద్ద నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకూ రహదారిపై ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు, వాహనదారులు, విద్యార్థులు, రోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అటు రామకృష్ణానగర్, శాంతినగర్‌ కాలనీల వద్ద కూడా పోలీసులు బారికేడ్‌లను ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు.

ఎంపీ కార్యాలయానికి వెళ్లే రహదారికి కూడా ఈ నిబంధనలు తప్పలేదు. ఆర్ట్స్‌ కళాశాలకు వెళ్లే రహదారిలో బ్యాంకులు, ఆర్‌సీఎం కళాశాల, ఆసుపత్రులు, కళాశాలలు, ప్రైవేటు పాఠశాలలు, వాణిజ్య సముదాయాలుతో నిత్యం కిటకిటలాడుతుంది. ముందస్తు సమాచారం లేకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో అటువైపు వచ్చే వాహనదారులు, ప్రజలను ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ట్రాఫిక్‌ పోలీసులతో వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్‌ ఎస్సై నాగరాజు తీరుపై ప్రజలు, వాహనదారులు బాహాటంగానే దుయ్యబట్టారు. రోడ్డు పనులు, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర విషయాలపై ముందస్తు సమాచారం ఇచ్చి ప్రజలు, వాహనదారులను అప్రమత్తం చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top