పర్యాటక అభివృద్ధి గాలికి! | Sakshi
Sakshi News home page

పర్యాటక అభివృద్ధి గాలికి!

Published Fri, Oct 2 2015 9:19 AM

tourism development promotion in AP

సాక్షి, హైదరాబాద్: ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పైసా ఖర్చు చేయని ప్రభుత్వం ఇతర దేశాల్లో రోడ్‌షోల పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోంది. బుద్ధుడి పేరిట టూరిజం ప్రాముఖ్యతను విదేశాలకు విస్తరించి వారిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త విధానాన్ని రూపొందించింది. నెలకు ఒక దేశాన్ని ఎంచుకొని ఆయా దేశాల్లో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి రోడ్‌షోలు నిర్వహించేలా ప్రణాళికను రూపొందించింది.

ఇందులో భాగంగా చైనా, జపాన్ దేశాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలతో కూడిన ఒక ప్రతినిధి బృందం వెళ్తోంది. విదేశీ పర్యాటకులు రాష్ట్రంలో ప్రత్యేకించి చూడదగ్గ ప్రాంతాలు లేకపోయినా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఇతర దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తుండాన్ని కొందరు అధికారులే తప్పు పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు ఒక శాతం కూడా వచ్చిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు.

పర్యాటక రంగాల అభివృద్ధికి నిధుల లేమి..
రాష్ట్రంలో ప్రధానమైన 54 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించి ఇందుకోసం అనేక ప్రోత్సాహకాలతో ప్రణాళికలను రూపొందించిన విషయం తెలిసిందే. వీటిలో తొమ్మిది పర్యాటక ప్రాంతాలను తక్షణం అభివృద్ధి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సాగర తీరాలు, జలాధార, ఎకో, బౌద్ధ, మత, వారసత్వ, వినోదం, సాహస, ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైద్య పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా వాటి కోసం ప్రత్యేకించి నిధులు విడుదల చేయలేదు.

పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నా నిధులు లేని కారణంగా అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు టూరిజంపై నిర్వహించిన ప్రతి సమీక్ష సమావేశంలోనూ చెబుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ముఖ్యంగా సాగరతీరంలో ఆహ్లాద థీమ్ పార్క్, వాటర్ వరల్డ్, నౌకాయానం, వినోద పార్కులు, మెరైన్ టూరిజం లాంటి పార్కులు ఎక్కడా లేవు. ఇలాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ప్రచారం కోసం విదేశాల్లో రోడ్‌షోల నిర్వహణకు, ప్రచారం కోసం హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోంది.

మొక్కుబడి కార్యక్రమాలు మినహా పర్యాటక అభివృద్ధి సుస్థిరం కావడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తీర ప్రాంత పర్యాటకాన్ని వివిధ ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తే లక్షలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా పట్టించుకోవడం లేదు.

Advertisement
Advertisement