పడిపోయిన టమాట ధర!

Tomato Prices Are Receded Farmers Are Worrying In Ananthapur - Sakshi

టమాట ధర వింటే రైతు నోటమాట రావట్లేదు. నిన్న మొన్నటి వరకు ఆశలు రేకెత్తించిన ధర.. ఇప్పుడు అమాంతం పడిపోవడంతో రూ.లక్షలు ఖర్చు చేసి పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో 30 కిలోల బాక్స్‌ ధర రూ.80 లోపే పలకడంతో.. పెట్టుబడి కాదు గదా రవాణా చార్జీలు దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించకపోవడం వల్లే తమకీ పరిస్థితి తలెత్తిందంటున్నారు.                       

సాక్షి, అనంతపురం : వేరుశనగ సాగు చేయడం.. దిగుబడి రాక అప్పులపాలు కావడం అనంత రైతులకు నిత్యకృత్యం. కానీ ఇప్పుడిప్పుడే రైతుల ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఈ క్రమంలో ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించారు. ఉన్నకొద్దిపాటి నీటి వనరులతోనే టామాట సాగుచేస్తున్నారు. అయితే పంట చేలో ఉన్నప్పుడు ఆశలు రేకెత్తిస్తున్న ధరలు...మార్కెట్‌కు తీసుకువెళ్లే సరికి అమాంతం పడిపోతున్నాయి. రవాణా చార్జీలు కూడా దక్కని పరిస్థితుల్లో రైతులు నిండా మునిగిపోతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 7,500 హెక్టార్లలో టామాటసాగులో ఉంది. విత్తనం కోనుగోలు , సేద్యం ఖర్చు, మందులు, కూలీలన్నీ కలుపుకుంటే ఎకరాకు సుమారుగా రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. 

తొలుత ఆశలు రేకెత్తించిన ధర 
నెలన్నర క్రితం వరకూ కిలో టామాట సుమారు రూ.40 నుంచి దాకా పలికింది. ఇందులో నాసిరకమే ఎక్కువగా ఉండేది. నల్లమచ్చలు, గోళీల కన్నా కాస్త పెద్దసైజు టమాటలను కిలో రూ.30 నుంచి రూ.40లకు కొనాల్సి వచ్చింది. నెల రోజుల నుంచి జిల్లాలో దిగుబడి అధికంగా వస్తోంది. ఈ క్రమంలో 20 రోజుల క్రితం 30 కిలోల బాక్సు ధర రూ. 250 నుంచి రూ.300 వరకు పలికింది. ఇప్పుడూ పరిస్థితి లేకుండా పోయింది. వారం, పది రోజులుగా ధర పూర్తిగా పతనమైపోతోంది. ప్రస్తుతం రవాణా, కూలీ ఖర్చులు రావడం లేదని రైతులు చెబుతున్నారు.  

ఇతర ప్రాంతాలకు తరలించినా.. 
జిల్లా రైతులు టమాట పంటను మదనపల్లి, పలమనేరు, హైదరాబాదు, రాజమండ్రి, నంద్యాల, ప్యాపిలి, బెంగళూరు, బళ్లారి, హోస్పేట్, బాగేపల్లి, చిక్‌బళ్ళాపూర్‌ తదితర ప్రాంతాల మార్కెట్లకు తరలిస్తున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాల రైతులు జిల్లాలోని స్ధానిక మార్కెట్లతో పాటు తమకు సమీపంలో ఉన్న అనుకులమైన మార్కెట్లకు పంటను పంపుతున్నారు. ప్రస్తుతం ఆయా మార్కెట్లలో 30 కిలోల బాక్సు సగటున రూ. 80లోపే పలుకుతోంది. ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల రైతులు పంటను కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ పెద్దసైజులో ఉన్న టమాటా 15 కిలోల బాక్సు రూ. 35 నుంచి రూ. 40 వరకు పలుకుతోందంటున్నారు.  

పొలాల్లోనే విడిచిపెట్టిన రైతులు 
ధర అమాతం పడిపోవడంతో చాలామంది రైతులు పంట కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఆశకొద్దీ కొంతమంది మండీలకు తరలిస్తున్నా...వారికి రవాణా, కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. మార్కెట్‌లో కమీషన్లు, మారుబేరం దెబ్బకు రైతులు అల్లాడిపోతున్నారు. కష్టపడి సాగుచేసిన పంటను మరీ దారుణమన రేటుకు అడుగుతుండటంతో కొందరు రైతులు వ్యాపారులకు ఇవ్వడం ఇష్టలేక రోడ్డుపై పడేసి వెళ్లిపోతున్నారు.  రైతును ఆదుకోవాల్సిన మార్కెటింగ్‌ శాఖ, జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. 

పెట్టుబడులు రాలేదు 
నేను రూ.లక్ష  ఖర్చు చేసి మూడు ఎకరాల్లో టమాట సాగు చేశాను. పంట చేతికి వచ్చే సరికి ధర భారీగా పడిపోయి పెట్టుబడి కూడా దక్కడం లేదు. 
– కృష్ణారెడ్డి, ఉద్దేహాళ్‌ 

గిట్టుబాటు ధర కల్పిస్తాం 
టమాట రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతుల నుంచి మండీ నిర్వహకులు ఎక్కువ కమీషన్‌ వసూలు చేస్తే చర్యలు తప్పవు. త్వరలోనే రైతులు, వ్యాపారులు, మండీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేస్తాం.         
– గుణభూషణ్‌రెడ్డి ఆర్డీఓ, సత్యనారాయణమూర్తి మార్కెంటింగ్‌ శాఖ ఏడీ     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top