అదే పోరు..అదే జోరు | TJAC demands to keep bhadrachalam in telangana | Sakshi
Sakshi News home page

అదే పోరు..అదే జోరు

Nov 28 2013 3:14 AM | Updated on Aug 28 2018 5:36 PM

భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. దీక్షలు, ర్యాలీలు, ప్రదర్శనలతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.

భద్రాచలం, న్యూస్‌లైన్:  భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. దీక్షలు, ర్యాలీలు, ప్రదర్శనలతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. భద్రాచలంలో టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నాటి దీక్షల్లో ఐకేపీ ఉద్యోగులు, ఐటీడీఏ నాల్గో తరగతి ఉద్యోగులు కూర్చొన్నారు. ఇదే శిబిరంలో నంగారభేరి పోరాట హక్కుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘానికి చెందిన పలువురు నాయకులు దీక్షలు చేపట్టారు. భద్రాచలాన్ని జిల్లాలోనే ఉంచాలని తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు ప్రవీణ్, ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. దాసు డిమాండ్ చేశారు.

ఎంతోకాలంగా జిల్లాలోని నీళ్లు, ఉద్యోగాలు, వనరులను ఆంధ్ర పాలకులు దోపిడీ చేశారని, వీటిని కొనసాగించేందుకే భద్రాచలం, హైదరాబాద్‌లపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దీక్షల్లో ఐకేపీ ఉద్యోగులు ఎం. నాగార్జున, నాగేశ్వరరావు, రమేష్‌బాబు, దుర్గారావు, రామారావు, శశిపూర్ణిమ, జ్యోతి, త్రిగుణ, వెంకటేశ్వర్లు, కె. అప్పారావు, చంద్రమోహన్ కూర్చొన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్‌రావు, రాజేంద్రప్రసాద్, ఐకేపీ ఏపీడీ జయశ్రీ, బీజే పీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, ఏపీటీఎఫ్ మహిళా నాయకురాలు రవికుమారి తదితరులు  సంఘీభావం ప్రకటించారు. లంబాడ హక్కుల పోరాట సమితి దీక్షల్లో  హుస్సేన్‌నాయక్, హరిసింగ్‌రాథోడ్, రామకృష్ణ, మదార్‌నాయక్, ప్రతాప్‌సింగ్, రత్ననాయక్, సీతారాములు, హరి, మాన్‌సింగ్, గోవింద్‌నాయక్ కూర్చొన్నారు.
 ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలి..
 భద్రాచలాన్ని ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని కాంట్రాక్ట్ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోకాళ్ల వెంకటేశ్వర్లు కోరారు. ఆదివాసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన దీక్షలను ఆయన ప్రారంభించారు. భద్రాచలం , అశ్వారాావుపేట నియోజకవర్గాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్త రాష్ట్రంలోనూ గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును బేషరత్తుగా నిలిపివేయాలన్నారు. దీక్షల్లో విద్యాశాఖకు చెందిన ఆదివాసీ ఉద్యోగులు శేఖర్, భాస్కర్, శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్రీను, సీతారామయ్య కూర్చొన్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, తిప్పన సిద్దులు, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కె. సీతారాములు సంఘీభావం ప్రకటించారు.
 కేబుల్ ఆపరేటర్ల జలదీక్ష
 తెలంగాణ గ్రామీణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరిలో జలదీక్ష చేపట్టారు. అంతకుముందు సమావేశమైన వారు భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని తీర్మానం చేశారు. ర్యాలీగా వెళ్లి రామాలయంలో పూజలు నిర్వహించారు. గోదావరిలో జలదీక్ష చేశారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నెబోయిన సీతారామయ్య, యానాల మల్లారెడ్డి,  చల్లా కోటేశ్వరరావు, పోట్లపల్లి వెంకటేశ్వర్లు, వెంకట్, మహ్మద్ సలీంతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఆపరేటర్లు పాల్గొన్నారు. టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు కూడా ఆదివాసీ దీక్షా శిబిరాన్ని సందర్శించారు.
 భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి...
 భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని గాంధీపథం జిల్లా కన్వీనర్, భద్రాద్రి రాజకీయ జేఏసీ అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివాసీ దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. పోలవరం నిర్వాసితుల ప్యాకేజీ పెంచాలన్నారు. కార్యక్రమంలో రేగలగడ్డ ముత్తయ్య, పాల్‌రాజ్, టీఆర్‌ఎస్ నాయకులు నలజాల శ్రీను, టీఆర్‌ఎల్‌డీ నాయకులు రామాచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement