డబ్బులిచ్చిన వారికే  టికెట్లు

Tickets For Who Give Money : Kadiri Baburao - Sakshi

టీడీపీలో అంతా మేనేజ్‌మెంటే

కనిగిరి, దర్శిల నుంచి రెండు నామినేషన్లు వేస్తా

కనిగిరి కార్యకర్తల సమావేశంలో కదిరి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు నాయుడు వద్ద పార్టీ ఆఫీసులో ఓ కోటరీ ఉంది. ఆ కోటరీని మేనేజ్‌ చేసిన వారికే తెలుగుదేశం పార్టీ టికెట్లు. ఇవన్నీ డబ్బులతోనే జరుగుతాయి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. సీటు కావాలంటే  ఆ కోటరీని మేనేజ్‌ చేస్తే చాలని కనిగిరి ఎమ్మెల్యే  కదిరి బాబూరావు ధ్వజమెత్తారు. కనిగిరి టికెట్‌ ఆశించి భంగపడిన కదిరి మంగళవారం సీఎస్‌పురం మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీపై ప్రెజర్‌ తెచ్చేందుకే మీటింగ్‌ పెట్టానన్నారు. మనమీటింగ్‌ ఇంటలిజన్స్‌ దాకా వెళ్లిందన్నారు. ఇప్పుడే చంద్రబాబు అనుచరుల నుంచి ఫోన్‌ వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తామన్నారు, చంద్రబాబు ఎంతమందికి ఎమ్మెల్సీ, మంత్రి పదవులిస్తారని కదిరి ఎద్దేవా చేశారు.

ఐవీఆర్‌ఎస్‌ కూడా మేనేజ్‌ చేస్తున్నారని ఉగ్రనరసింహారెడ్డి పై కదిరి పరోక్ష విమర్శలు చేశారు. ఐవీఆర్‌ఎస్‌ వలన చంద్రబాబు నాయుడు భ్రమలో ఉంటున్నాడన్నారు. ఉగ్రనరసింహారెడ్డిని 90 శాతం కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని కదిరి చెప్పారు.  మొన్నటి దాకా జనార్దన్‌ హీరో.. ఆయన పిల్లోడయినా దేవుడిని కూడా లెక్కలేకుండా మాట్లాడాడు. ఆ తరువాత  ఆమంచి కృష్ణమోహన్, మాగుంటలకు  మంచిసీన్‌ ఇచ్చారని కదిరి చెప్పారు. వారు వెళ్లిన తరువాత ఇప్పుడు బలరామే హీరో. జిల్లాకి హెడ్‌ అయ్యాడన్నారు. వయస్సు పైబడడంవల్ల చంద్రబాబు  భ్రమల్లో పడి మోసపోతున్నాడన్నారు. బాబు ఎప్పుడూ కంప్యూటర్‌లు అంటాడు. మనుషులు కన్నా కంప్యూటర్‌లు ఎక్కువా..చంద్రబాబు నాయుడు పెట్టిన టెక్నాలజీని కొందరు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని కదిరి విమర్శించారు. అది ఆయనకు అర్థం కావడంలేదన్నారు.

అదేమంటే నా కంప్యూటర్‌ చూడు, నా డాష్‌బోర్డు చూడు అంటున్నాడు. ఆ కంప్యూటర్‌లో ఏముంటుందో ఆ దేవుడికి తప్ప అది ఎవరికి తెలియదని కదిరి చంద్రబాబును ఎద్దేవా చేశారు. బాలకృష్ణ ఉన్నాడు ఇబ్బంది ఉండదనే చేశాను. కానీ చంద్రబాబు నాయుడు దేనికి లొంగాడో తెలియదు. నాకు సీటు ఇవ్వలేదని కదిరి వాపోయారు. నన్ను వద్దంటే రెడ్డి అయినా, కమ్మ అయినా పార్టీలో ఉన్నవారికి ఇవ్వాలని చెప్పానన్నారు.  10 రోజుల క్రితం వచ్చిన వారికి టికెట్టు ఎలా ఇస్తాడన్నారు. 95 శాతం సీట్ల మార్పులు ఉండవన్నారు. 24 దాకా ప్రయత్నం చేస్తా  ఇక్కడ కూడా నామినేషన్‌ వేద్దాం ఇండిపెండెంట్‌గా అయినా సరే అన్నారు. రెండుచోట్ల నామినేషన్‌లు వేస్తానన్నారు. తాను ఇప్పుడు సీటు వద్దంటే దర్శి వేరేవారికి ఇస్తారని కదిరి చెప్పారు. గతంలో ఓఎస్‌డీగా పనిచేసిన  వెంకయ్య చౌదరి నాకు ఫోన్‌ చేసి ఉగ్రని గెలిపించాలని చెప్పాడన్నారు.

ఒక వేళ టికెట్‌ ఇచ్చిన చోట అంటే ఓడతామనే దర్శికి వెళ్లాలి... గెలిస్తే కార్యకర్తలకు న్యాయం చేయగలను. గెలవకున్నా పార్టీ లో ఉంటే ఇక్కడ ఉగ్ర నుంచి మీకు ఇబ్బంది ఉండదని అన్నారు.  ఇండిపెండెంట్‌ గా పోటీ చేయడం కూడా కరెక్టు కాదన్నారు. వేస్తే 30 వేల ఓట్లు కూడా రాకుండా ఓడిపోతే అసహ్యంగా ఉంటుందన్నారు.  భయంతో ఉగ్రనరశింహారెడ్డి ఉదయం 8 గంటలకు వెళ్లి కనిగిరి బీఫాం కూడా తీసుకుని వెళ్లిపోయాడన్నారు. శిద్దా సహకరిస్తానంటే దర్శి వెళ్తానని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top