
ఉసురు తీసిన ఈతసరదా
ఈత సరదా పసివారి ఉసురుతీసింది. ఆదివారం బడికి సెలవు కావడంతో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి ఊపిరాడక మృత్యువాత పడ్డారు.
కొప్పెప్పాడు(సంతమాగులూరు): ఈత సరదా పసివారి ఉసురుతీసింది. ఆదివారం బడికి సెలవు కావడంతో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి ఊపిరాడక మృత్యువాత పడ్డారు. బల్లికురవ మండలం కొప్పెరప్పాడులో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన బుర్రి బుల్లియ్య ఏకైక కుమారుడు శ్రీను (8), గోరంట్ల గంగయ్య చిన్న కుమారుడు కుమారుడు అజయ్ (11)లు స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడు, ఐదు తరగతులు, బుర్రి ఆంజనేయులు చిన్న కుమారుడు అశోక్ (11) ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. వీరి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైకిల్‌పై గ్రామం సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు.
ముగ్గురూ ఒకేసారి చెరువులో దూకారు. చిన్నవాడైన శ్రీను ముందుగా నీట మునగడంతో అతడ్ని రక్షించేందుకు అశోక్, అజయ్ కూడా నీటి లోతులోకి వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ మునిగిపోయి ఊపిరాడక చనిపోయారు. సాయంత్రం 6 గంటల సమయంలో చెరువు కట్టపై వస్తున్న స్థానికులు అక్కడ సైకిల్ మాత్రమే ఉండి..పిల్లలు కనిపించకపోవడంతో చెరువు నీటిలోకి చూశారు. అక్కడ పిల్లల మృతదేహాలు తేలుతూ కనిపించాయి.
దీంతో వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పొలం పనుల నుంచి వచ్చిన వారు విషయం తెలుసుకుని బోరున విలపిస్తూ చెరువు వద్దకు వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. కన్నవారిని గుండెలకు హత్తుకుని రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ముగ్గురు చిన్నారులు సమీప బంధువుల బిడ్డలు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఘటనా స్థలాన్ని సందర్శించిన అద్దంకి సీఐ:
ముగ్గురు బాలురు చెరువులో మునిగి మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ పి.సాంబశివరావు, బల్లికురవ ఎస్సై చౌడయ్యలు హుటాహుటిన కొప్పెరప్పాడు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని కేసు నమోదు చేశారు.