ఆదర్శం అపహాస్యం


  •      ఈ ఏడాదీ వసతి లేకుండానే ప్రవేశాలు

  •      మూడేళ్లుగా కొనసాగుతున్న  భవన నిర్మాణాలు

  •      స్థల అన్వేషణలోనే రావికమతం వసతిగృహం

  •      పాఠశాలల్లో విద్యార్థులకు తప్పని అవస్థలు

  • ప్రైవేటుసంస్థలకు దీటుగా పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన రీతిలో విద్యా బోధన చేయాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు ఆపహాస్యమవు తున్నాయి. హాస్టల్‌తో కలిపి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, తరగతులు ప్రారంభించి ఏడాదవుతున్నా నేటికీ వసతి సమకూరలేదు. దీంతో విదార్థులు డేస్కాలర్‌గా పాఠశాలకు వెళ్లేందుకు అనాసక్తి కనబరుస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీషు మీడియంలో ప్రత్యేక బోధనకు అప్పటి ప్రభుత్వం ఆదర్శపాఠశాలలు ఏర్పాటు చేసింది. ఆశయం బాగున్నా..ఆచరణలో మాత్రం వీటి పరిస్థితి మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు చందంగా మారింది.

     

    నర్సీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని నర్సీపట్నం మండలం వేములపూడి, రావికమతం మండలం మరుపాక, తేగాడ కశింకోట మండలం, మంచాల చీడికాడ మండలం, పాటిపల్లి మునగపాక మండలాల్లో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసింది. వీటిల్లో విద్యార్థులకు వసతిని కల్పించి తరగతులు ప్రారంభించాలని అప్పట్లో సంకల్పించింది. మొదటి ఏడాది పాఠశాల భవనాల నిర్మాణం సైతం పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అప్పట్లో తరగతులు వాయిదా వేశారు.



    పాఠశాల భవనాలు పూర్తికావడంతో తదుపరి ఏడాది నుంచి తరగతులు ప్రారంభించారు. అప్పుడు తీరిగ్గా వసతిగృహ నిర్మాణాలు ప్రారంభించారు. అవి పూర్తికాకుండానే వసతి కల్పిస్తామంటూ విద్యార్థులను మభ్యపెట్టి ప్రవేశాలు పూర్తిచేశారు. దీంతో చదువులు బాగుంటాయన్న ఆశతో విద్యార్థులు తరగతుల్లో చేరారు. ఈ భవనాలు నేటికీ పూర్తికాలేదు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యమే కారణమని సంబంధిత ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు.



    ఇదిలా ఉండగా రావికమతం మండలం మరుపాక పాఠశాల వసతి గృహానికి నేటికీ స్థల సమస్య వేధిస్తోంది. మిగిలిన నాలుగు చోట్ల భవనాలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు గతేడాదంతా ఇళ్ల నుంచి రాకపోకలు సాగించారు. ఆయా మండలాలకు చెందనివారి పరిస్థితి దయనీయంగా ఉంది.  వసతి ఉంటుందని భావించి, పాఠశాలల్లో చేరిన విద్యార్థులు రోజూ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన ప్రయాణ సాధనాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు.

     

    వీటిని పట్టించుకోకుండా అధికారులు ఈ ఏడాది సైతం ప్రవేశాలకు చర్యలు చేపట్టారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో 80 మంది చొప్పున ఐదింట 400 మందికి మంగళవారం ప్రవేశాలు కల్పించారు. ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. గతేడాది పరిస్థితే ఈ ఏడాదీ పునరావృతం కానుండడంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ భవనాలు నిర్మాణం పూర్తికాకపోవడంతో హాస్టల్ వసతి కల్పించడం లేదన్నారు. ఇవి పూర్తయిన వెంటనే వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top