రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలి | Sakshi
Sakshi News home page

రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలి

Published Sun, Jun 15 2014 2:12 AM

రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలి

ఒంగోలు కలెక్టరేట్ : ఉలవపాడు మండలం రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో నినదించాయి. ప్రకాశం జిల్లాకు మంజూరైన ఓడరేవును పొరుగు జిల్లావాసులు తన్నుకుపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్దఎత్తున ఒత్తిళ్లు తీసుకురావాలని నిర్ణయించాయి. ప్రభుత్వాలు స్పందించకుంటే ఆగస్టు 15 నుంచి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించాయి.
 
రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రంగాభవన్‌లో రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధి చుండూరి రంగారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటుచేస్తే ప్రకాశం జిల్లా ప్రగతికే కాకుండా నవ్యాంధ్ర నిర్మాణానికి అద్భుతమైన అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
 
రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధి చుండూరి రంగారావు అన్నారు. రామాయపట్నం ఓడరేవు కోసం పాలకులకు ముందుగా విజ్ఞాపన పత్రాలు ఇస్తామని, వారు స్పందించకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని  ఎంతమందికి విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని ఆచార్య ఎన్‌జీ రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య గుర్తు చేశారు.  టెక్నికల్ కమిటీ  రామాయపట్నం పోర్టుకు అనుకూలమని తేల్చిందని చెప్పారు.

 రామాయపట్నంకు ముందుగా మంజూరైన ఓడరేవును దుగరాజుపట్నంకు తరలించడంపై హైకోర్టులో పిల్ వేసినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ వెల్లడించారు. రామాయపట్నం పోర్టును తరలించేందుకు కేంద్ర స్థాయిలో జరిగిన అక్రమాలపై సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement