
వారికి ప్రజలే బుద్ధి చెప్తారు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి....
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి
యర్రగొండపాలెం: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు దొంత కిరణ్‌గౌడ్ వివాహానికి వచ్చిన ఆయన స్థానిక రోడ్డు, భవనాల శాఖ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయనతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
బాలినేని మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువాలు కప్పుకొని అనైతికంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి నైతిక విలువలను కాపాడుకోవాలన్నారు. రాజధాని పేరుతో అక్రమంగా భూములు కొనుగోలుచేసి వేల కోట్లు సంపాదించుకున్నారన్నారు. ఆ డబ్బుతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు ఎరవేసి తమ పార్టీలోకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. ప్రలోభాలకు లొంగి వెళ్లినంతమాత్రాన ఇక్కడి నాయకులు, ప్రజలు వైఎస్సార్ సీపీలోనే ఉన్నారన్నారు. యర్రగొండపాలెంలో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి ఆయన ఒక్కడే వెళ్లిపోయాడని, త్వరలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి వారి అభీష్టం మేరకు ఇన్‌చార్జిని నియమిస్తారని ఆయన అన్నారు.