బ్లాస్టింగ్‌లతో దద్దరిల్లిన మల్లాపురం | The massive explosion televisions, cooking equipment destroyed | Sakshi
Sakshi News home page

బ్లాస్టింగ్‌లతో దద్దరిల్లిన మల్లాపురం

Oct 19 2013 2:55 AM | Updated on Sep 1 2017 11:45 PM

బండరాళ్లను పగులగొట్టేందుకు క్రషర్ నిర్వాహకులు చేసిన బ్లాస్టింగ్‌లధాటికి మల్లాపురం గ్రామం దద్దరిల్లింది. ఇళ్లు బీటలు బారడంతో గ్రామస్తులు సంబంధిత క్రషర్ యూనిట్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు.

రాయదుర్గం రూరల్, న్యూస్‌లైన్ : బండరాళ్లను పగులగొట్టేందుకు క్రషర్ నిర్వాహకులు చేసిన బ్లాస్టింగ్‌లధాటికి మల్లాపురం గ్రామం దద్దరిల్లింది. ఇళ్లు బీటలు బారడంతో గ్రామస్తులు సంబంధిత క్రషర్ యూనిట్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి. మల్లాపురం సమీపంలోని కొండల్లో సాయిక్రిష్ణ క్రషర్ నిర్వాహకులు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రెండు బోరు బ్లాస్టింగులు చేయడంతో దగ్గరలోని ఇళ్ల గోడలు బీటలు బారాయి. విద్యుత్ సరఫరా బంద్ అయ్యింది. ఈ భారీ పేలుడు ధాటికి టీవీలు, వంట సామగ్రి ధ్వంసమయ్యాయి. పిల్లలు, వృద్ధులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆగ్రహించిన దాదాపు 300 మంది క్రషర్ యూనిట్‌కు వెళ్లి అక్కడున్న లారీలు, షెడ్లు, మిషన్లను ధ్వంసం చేశారు.
 
 కషర్ నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. గతంలో కూడా బ్లాస్టింగ్‌ల ధాటికి దాదాపు వందల ఇళ్లు దెబ్బతిన్నాయని బాధితులు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడబోమని నిర్వాహకులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ బ్లాస్టింగ్‌లకు పాల్పడినందునే తాము క్రషర్‌పై దాడికి దిగాల్సి వచ్చిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. శనివారం ఉదయం క్రషర్ నిర్వాహకులను పిలిపించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాఘవరెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement