పదో తరగతి పరీక్షా ఫలితాలను మే 28 లేదా 29 తేదీల్లో విడుదల చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షా ఫలితాలను మే 28 లేదా 29 తేదీల్లో విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది కంటే ఫలితాల విడుదల ఈసారి మూడు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెన్త్ పరీక్షలకు సంబంధించిన 65 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని 13 కేంద్రాల్లో దాదాపు 15 వేలమంది టీచర్లు మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. ఈ నెల 28నాటికి మూల్యాంకనం పూర్తి కావచ్చని అంచనా. తరువాత కంప్యూటరీకరణ తదితర కార్యక్రమాలు పూర్తిచేసి మే ఆఖరుకల్లా ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వ పరీక్షల డెరైక్టరేట్ వర్గాలు వివరించాయి.
జూన్ మూడోవారంలో సప్లిమెంటరీ పరీక్షలు
టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను జూన్ మూడో వారంలో నిర్వహిస్తారు. టెన్త్ కామన్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని, ఈ పరీక్షలకోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. జూన్ మూడోవారంలో పరీక్షలు నిర్వహించి తదుపరి త్వరగా ఫలితాలు విడుదల చేస్తామని, ఆ విద్యార్థులకు ఇంటర్‌లో ప్రవేశాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టామని వివరించాయి.