మహిళా రక్షక్‌

Ten She Teams In PSR Nellore - Sakshi

నగరంలో 10 బృందాల ఏర్పాటు

తొలుత కౌన్సిలింగ్‌ ఆపై కేసులు

ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

నెల్లూరు(క్రైమ్‌): మహిళలపై వేధింపులు, దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణకోసం మహిళా రక్షక్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. తొలిసారిగా జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని ఆరు పోలీస్‌ స్టేషన్లు, నెల్లూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్, మహిళా పోలీస్‌ స్టేషన్ల సిబ్బందితో 10 బృందాలు (ఒక్కో స్టేషన్‌కు ఒక్కో బృందం, మహిళా స్టేషన్‌లో మూడు బృందాలు)ను నియమించామని, వారిద్వారా పోకిరీల భరతం పడతామని ఎస్పీ చెప్పారు. మంగళవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో ఉన్న ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో బృందాలను ఎస్పీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ప్రయత్నంగా జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళా డీఎస్పీ పి.శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయన్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మగ పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. వీరు ఆయా ప్రాంత పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మహిళలపై వేధింపులు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి మఫ్టీలో సంచరిస్తారన్నారు. ఈవ్‌టీజింగ్, మహిళలపై దాడులకు పాల్పడేవారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తారన్నారు. మొదటిసారి పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామన్నారు. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై కేసులు నమోదుచేసి జైలుకు పంపుతామని చెప్పారు.

నిఘా కెమెరాలతో పరిశీలన
ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ కె.శ్రీనివాసాచారి పర్యవేక్షణలో కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది అక్కడి నుంచే సీసీ కెమెరాల ద్వారా నగరంలో ఈవ్‌టీజింగ్, దాడులను గుర్తించి మహిళా రక్షక్‌ బృందాలకు సమాచారం అందిస్తారన్నారు. వెంటనే సిబ్బంది నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకొంటారన్నారు. పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. తమ ప్రాంతాల్లో యువతులపై ఆకతాయిల వేధింపులు, మహిళలపై దాడులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

బాధ్యతాయుతంగా పనిచేయండి
మహిళా రక్షక్‌ బృందాల్లోని సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ అన్నారు. మీరిచ్చే స్ఫూర్తితో జిల్లాలోని అన్నీ పట్టణాల్లో రక్షక్‌ బృందాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాలను త్వరలోనే సమకూరుస్తామన్నారు. అనంతరం ఆయన మహిళా రక్షక్‌ బృందాల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అడ్మిన్, క్రైమ్‌ ఏఎస్పీలు పి.పరమేశ్వరరెడ్డి, ఆంజనేయులు, ఏఆర్‌ ఏఎస్పీ వీరభద్రుడు, నెల్లూరు నగర, ఎస్సీ, ఎస్టీ సెల్‌–1, మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, కె.శ్రీనివాసాచారి, పి.శ్రీధర్, నగర ఇన్‌స్పెక్టర్లు పాపారావు, వేణుగోపాల్‌రెడ్డి నరసింహారావు, పి.శ్రీనివాసులురెడ్డి, ఎస్సై తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సిబ్బందికి అభినందన   
ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కొందరిపై కత్తులతో దాడిచేయబోయిన వారిని చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్‌ ఆర్‌ఎస్సై కృష్ణయ్య, కానిõస్టేబుల్‌ శివకృష్ణలను ఎస్పీ రస్తోగి అభినందించారు. సిబ్బంది సకాలంలో స్పందించి నిందితులను పట్టుకోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదన్నారు. అనంతరం వారికి నగదు రివార్డులను అందించారు.

ఫోన్‌ నంబర్లు 
మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలిపేందుకు వీలులేని పక్షంలో డయల్‌ 100కు ఫోన్‌ చేయొచ్చు. లేదా 93907 77727, 94904 39561లకు ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top