హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
- సిద్ధేశ్వరాలయం చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం
- మంగళూరుకు తరలి వెళ్లిన పోలీసు బృందం
- కొనసాగుతున్న అనుమానితుల విచారణ
మడకశిర: హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ చోరీకి రెక్కీ నిర్వహించినట్లు భావిస్తున్న హేమంత్ అనే వ్యక్తి సెల్‌ఫోన్ నంబర్ ఈ కేసులో కీలకంగా మారింది. చోరీ చేసిన ముఠాలో ఇతను సభ్యుడై ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. ఇతను వారం రోజులపాటు వాచ్‌మెన్లు, తోటమాలితో కలిసి దేవాలయంలో నిద్రించాడని, అప్పట్లో వారికి ఓ సెల్ నంబర్‌ను ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఫోన్ మంగళూరు ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో, అగళి ఎస్‌ఐ మోహన్‌కుమార్ ఆధ్వర్యంలో ఓ పోలీసు బృందం మంగళూరు జిల్లాకు వెళ్లినట్లు సమాచారం. హేమంత్‌ను గుర్తుపట్టేందుకు ఎలాంటి ఫొటోలు అందుబాటులో లేకపోవడంతో, అతని ఊహాచిత్రాలను గీయిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న దేవాలయ వాచ్‌మెన్లు, తోటమాలి నుంచి ఉపయోగకరమైన సమాచారం ఏదీ లభించలేదని తెలిసింది. క్లూస్‌టీం సంపాదించిన వేలిముద్రల ఆధారంగా కూడా ఈ కేసును విచారిస్తున్నారు. ఈ చోరీతో మేల్కొన్న దేవాదాయ శాఖ అధికారులు ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించారు.
బంగారు ఆభరణాలు సేఫ్
శ్రీసిద్దేశ్వరస్వామికి దాదాపు ఒక కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు దేవాదాయ శాఖాధికారులు తెలుపుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వీటిని గుడిబండలోని సిండికేట్ బ్యాంకు లాకర్‌లో భద్రపరచినట్లు తెలిసింది. వెండి ఆభరణాలను కూడా లాకర్‌లో ఉంచి వుంటే నష్టం ఇంత తీవ్రంగా ఉండేది కాదని భక్తుల వాదన. కాగా, ఆలయంలో రెండు చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు నివేదిక పంపినట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. కాగా, ఈ కేసులో నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటకలోని మంగళూరుకు తరలి వెళ్లిందని సీఐ హరినాథ్ తెలిపారు. త్వరలోనే కేసును ఛేదించి, నిందితులను అరెస్టు చేస్తామని వివరించారు.
కళా విహీనంగా మూలవిరాట్టు
అమరాపురం: వెండి ఆభరణాల అలంకరణతో నిత్యం సుందరంగా కనిపించే హేమావతి ఆలయంలో శ్రీ హెంజేరు సిద్ధేశ్వర స్వామి మూలవిరాట్టు, ఆభరణాలన్నీ చోరీకి గురి కావడంతోశుక్రవారం బోసిపోయి కళావిహీనంగా కనిపిస్తోంది. చోరీ విషయం తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు, కర్ణాటకలోని భక్తులు సైతం శుక్రవారం పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు యథావిధిగా నిర్వహించారు.