బయోందోళన

Teachers Suffering With Biometric Mitions - Sakshi

వీడని టీచర్ల కష్టాలు నెలకో వెర్షన్‌..

ప్రహసనంగా ఈ–హాజరు

సర్వర్‌ సమస్యలతో సమయం వృథా

జీతాలకు అనుసంధానించడంతో ఆందోళన

పశ్చిమగోదావరి, నిడమర్రు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు మూడేళ్లుగా అమలవుతోన్న బయోమెట్రిక్‌ ఈ–హాజరు ప్రక్రియ నేటికీ గాడిన పడలేదు. నెల కోసారి సాప్ట్‌వేర్‌ మార్పులతో ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించినా ఆ మేరకు ఫలితాలు కనిపించడం లేదు. అడుగడుగునా సాంకేతిక సమస్యలతో ఈ హాజరు నమోదు ప్రక్రియపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ–హాజరు నమోదును జీతాలకు ముడిపెట్టడంతో నిత్యం గురువులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

హాజరుపై మరితం నిఘా
ప్రస్తుతం జిల్లాలో అన్ని  పాఠశాలల్లో ఆధార్‌ ఐడెంటి ఐరీస్‌ (ఆధార్‌తో అనుసంధానం ఐన నేత్ర గుర్తింపు) ట్యాబులు, లేదా దానికి అనుసంధానించిన వేలిముద్రల గుర్తింపు పరికరాలు అందించారు. ఉపాధ్యాయులు నమోదు చేసే ఈ–హాజరు పూర్తి వివరాలు సీఎం–డాష్‌ బోర్డుకు అనుసంధానించారు. ఐతే కొన్ని చోట్ల స్థానికంగా ఉండే ప్రాథమిక ఉపాధ్యాయులు విద్యాశాఖ అందించే ట్యాబులను ఇంటి వద్దకు పట్టుకుపోయి నిర్ధేశించిన సమయానికి ఇంటి నుండే ఈ–హాజరు వేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో తాజాగా కొత్త సాప్ట్‌వేర్‌ విద్యాశాఖ రూపొందించింది. హాజరుపై మరింత నిఘా పెట్టేందుకు ఈ–హాజరు సాప్ట్‌వేర్‌ను ఎస్‌ఈ–హాజరుగా ఈనెల 5వ తేదీ నవీకరించారు. పాఠశాలలకు అందించిన ఐరీస్‌ ట్యాబ్‌ల ఈ సాప్ట్‌వేర్‌తో ఉపాధ్యాయులు ఈ–హాజరును పాఠశాల పరిధిలో వేసారా లేదా వేరే చోట నుంచి వేసారా అనేది గమనించేలా జీపీఎస్‌కు ఈ సాప్ట్‌వేర్‌ అనుసంధానించినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చిన సాప్ట్‌వేర్‌ ప్రకారం సర్వర్‌ కెపాసిటీ పెంచకపోవడంతో మూడు రోజులుగా జిల్లాలోని ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌ యంత్రాలతో గంటల కొద్ది కుస్తీపడుతున్నారు. దీనికి తోడు పాఠశాలల్లో ఉన్నవి ఎక్కువగా నాసిరకం యంత్రాలే. వాటితో ఉపాధ్యాయులు పడుతోన్న ఇబ్బందులు చూస్తే ఈ విధానం యావత్తూ గందరగోళంగా మారినట్టు అనిపిస్తోంది.

నేటికీ గాడిన పడని వ్యవస్థ
బయోమెట్రిక్‌ ఈ–హాజరు వ్యవస్త  ప్రారంభించి మూడేళ్లవుతున్నా నేటికీ గాడిన పడలేదు.ఏ పాఠశాలలో చూసినా సమస్యలే సమస్యలు. వాటిని పరిష్కరించే టెక్నీషియన్లను తగిన సంఖ్యలో సిద్ధం చేయకపోవడంపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. యంత్రాలన్నీ స్టేట్‌ సర్వర్‌కు అనుసంధానించడం వల్ల సిమ్‌ కార్డుల ద్వారా సిగ్నల్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. వేలిముద్రని తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఏ నెట్‌వర్కకు సంబంధించిన సిమ్‌ ఐనా సిగ్నల్‌ సరిగ్గా లేకపోవడం వల్ల హాజరు సకాలంలో నమోదు కావడం లేదు.

సమస్యలివీ..
ఎంతసేపు చార్జింగ్‌ పెట్టినా డివైస్‌లు వెంటనే డీచార్జి అవుతున్నాయి. డివైస్‌లు క్యాలిటీ లేదు. సమస్య వచ్చినప్పుడు టెక్నీషయన్‌ ఉన్నా సాప్ట్‌వేర్‌ సమస్యలపై సరైన అవగాహన ఉన్నవారు రాష్ట్ర, జిల్లా స్థాయిలో లేదు. కొన్ని సందర్భాల్లో మొదట గ్రీన్‌ టిక్‌ రాదు, దానికోసం పది నుంచి 20 నిమిషాలు సమయం తీసుకొంటుంది. దీంతో గ్రీన్‌టిక్‌ రాని ఇష్యూని లాగిన టైమ్‌గా, గ్రీన్‌టిక్‌ వచ్చిన ఇష్యూని లాగవుట్‌ టైమ్‌గా పరిగణిస్తోంది. దీంతో టీచర్లు బెంబేలవుతున్నారు.

చార్జింగ్‌ డౌన్‌
యంత్రాలలోని (ఈ–హాజరు) యాప్‌ను పదేపదే మార్పులకు గురిచేయడంవల్ల టీచర్లకు సరిగ్గా అర్థం కావడం లేదు. 8.45 నుంచి 9.30 గంటలమధ్యలో ప్రైమరీ–హైస్కూల్‌ టీచర్లు అందరూ ఒకేసారి పంచింగ్‌ చేయడం వల్ల లోడ్‌ పెరిగి కనెక్ట్‌ అవడం బాగాఆలస్యమవుతోంది.

ఇలా చేస్తే ఫలితం
ట్యాబుల్లో వేసిని సిమ్‌ల డేటా స్టోరేజ్‌ నెలంతా పరిపోవటం లేదు. దానిని పెంచాలి. డౌన్‌లోడ్‌ స్పీడ్‌ పెరగాలి. నాణ్యమైన యంత్రాలనే స్కూళ్లకు పంపిణీ చేయాలి. ఆ యంత్రంలో ఏ సమస్య వచ్చినా ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన పరిస్థితిని తప్పించాలి. ప్రతి మండలంలో ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఒక టెక్నీషన్‌ను అందుబాటులో ఉంచాలి.

కొత్త వెర్షన్లతో అవస్థలు
సాప్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసి కొత్త సాప్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న ప్రతిసారీ ఐరీస్‌ వేసేందుకు గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తుంది. పాఠశాలకు నిర్ణీత సమయంలో వెళ్లినప్పటికీ సిగ్నల్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది.  దీంతో ఆన్‌లైన్‌లో హాజరు నమోదు కావడంలో సమస్యలు తలెత్తుతున్నాయి.– పరిమితి సత్తిరాజు, ఎస్జీటీ, నారాయణపురం

ఉన్నతాధికారుల దృష్టికి సమస్య
ఉపాధ్యాయులు ఈ–హాజరు విషయంలో జీపీఎస్‌ అనుసంధానిస్తూ ఎస్‌ఈ హాజరుగా కొత్త వెర్షన్‌ రాష్ట్ర ఐటీ సెల్‌ తీసుకొచ్చింది. ఈ సమస్య రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. రాష్ట్రమంతా ఈ సమస్య ఉన్నట్లు, ఒకటి రెండు రోజుల్లో ఈ సాంకేతిక సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top