‘బోధనేతర పనుల’పై భగ్గుమన్న ఉపాధ్యాయలోకం

Teachers Angry On Government - Sakshi

టీచర్ల విధి విధానాల నూతన చట్టాల ముసాయిదా విడుదల

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ వర్గాలు

జిల్లా స్థాయిలో ఉద్యమ కార్యాచరణకు ఈ నెల 28న ముహూర్తం

విజయనగరంఅర్బన్‌ :  ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒక్క ఎన్నికల విధులు మినహాయించి ఏ ఒక్క బోధనేతర కార్యక్రమాలూ అప్పగించరాదని సుప్రీంకోర్టు నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి.  ఈ అంశంలో పలుమార్లు సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ ఉపాధ్యాయుల విధి విధానాల నూతన చట్టాన్ని రూపొందిస్తోంది. ఉపాధ్యాయ పరిపాలనా చట్టం (టీచర్‌ అడ్మినిస్ట్రేషన్‌ యాక్ట్‌), ఉపాధ్యాయ బదిలీ చట్టం (టీచర్‌ ట్రాన్సఫర్‌ యాక్ట్‌) పేర్లతో వేర్వేరుగా ప్రత్యేక చట్టాలను తెస్తోంది.

ముందుగా వాటి ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ ఇటీవల వెబ్‌సైట్లో పెట్టి టీచర్ల అభిప్రాయాలను కోరింది. విద్యాబోధన ప్రమాణాలపై తీవ్రంగా ప్రభావం చూపే ఈ చట్టాలను ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 14 వేల మంది ఉపాధ్యాయులు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. చట్టాల ముసాయిదాతోనే కథను ముగింప చేసే దిశగా ఉద్యమాలకు దిగాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలు జిల్లా స్థాయిలో రూపొందించేందుకు ఈ నెల 28న ముహూర్తం ఖరారు చేసింది. 

బోధనేతర పని తీరుకు పాయింట్లు

టీచర్‌ అడ్మినిస్ట్రేషన్‌ యాక్టుకు సంబంధించి వారి పనితీరును అంచనా వేసేలా కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తున్నారు. అయితే, వృత్తిరీత్యా నిర్వహించే బోధన నైపుణ్యాలపై కాకుండా సంబంధంలేని బయోమెట్రిక్‌ అటెండెన్సు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం అప్పగించిన బోధనేతర పనుల తీరును అంచనా వేసేవి ఉండడాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధ్యాహ్నభోజనం, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులతో సహా విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో ప్రభుత్వానికి సమర్పించడం వంటి వాటిలో ఉపాధ్యాయుల పనితీరుకు ఇన్సెంటివ్, బదిలీలకు పాయింట్లు ఇవ్వడం వంటి అంశాలపై మండి పడుతున్నారు. 

బదిలీ హక్కులు హరించేవిగా..

టీచర్ల బదిలీ హక్కును హరించే విధంగా అనేక నిబంధనలను ప్రభుత్వం చట్టంలో పొందుపరుస్తోంది. ఇతర శాఖలకు లేని అనేక షరతులు, నిబంధనలు ఇందులో ఉన్నాయి. కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామాల్లో స్కూళ్లను నాలుగు విభాగాలుగా విభజిస్తున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ఒక క్రమపద్ధతిలో చేపట్టేందుకు వీలుగా ఈ చట్టాన్ని తెస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ తరుణంలో ప్రమాణాలు సాధించడానికి ఆస్కారం ఎక్కడుందని ఉపాధ్యాయు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల ప్రమాణాల మెరచలేకపోవడానికి విద్యార్థి కుటుంబ పరిస్థితులు, స్థానిక పరిస్థితులు కారణాలు కాగా వాటికి ఉపాధ్యాయులను బాధ్యులను చేసేలా చట్టం చేవడం సరికాదని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి.

నల్ల చట్టాలను రానీయం కానీయం..

ఉపాధ్యాయ హక్కులను హరించే నల్ల చట్టాలను తమిళనాడులో కూడా తీసుకొచ్చారు. అక్కడి ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఇప్పటికే కార్మికులను బానిసులుగా చేసే చట్టాలను పరిశ్రమరంగంలో తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యారంగంలోని ఉపాధ్యాయులపై ప్రయోగించబోతున్నారు. ఆ చట్టాలను రానీయం. బిల్లుకానీయకుండానే అడ్డుకుంటాం. 

– బంకురు జోగినాయుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు, ఏపీటీఎఫ్‌ (257) 

కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా...

ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికే ఈ చట్టాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ విద్యను పటిష్టపరిచే ఆలోచనే ఉంటే బోధన రంగంలో వినూత్న ప్రయోగాలు చేయాలి. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉపాధ్యాయుని హక్కులను ఎలా హరింపచేయాలో స్పష్టంగా పరిశీలించి చట్టాలను తెస్తున్నారు.

ఉపాధ్యాయ సంఘాలన్నీ దీనిని అడ్డుకోవాలి. 

– బంకపల్లి శిపప్రసాద్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్‌చార్జి, పీఆర్‌టీయూ

కోర్టుపరిధి నుంచి తప్పించే ఆలోచన దుర్మార్గం

ఉపాధ్యాయులు తప్పిదాలు చేస్తే వారిని సర్వీసు నుంచి తప్పించే అధికారం విద్యాశాఖకు ఉంటుందని అయితే దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. కొత్త చట్టాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకునేందుకు వీల్లేదని నిబంధనలు పెట్టారు. ఈ ఆలోచన దుర్మార్గం. సీపీఎస్‌ రద్దు ఉద్యమం తారాస్థాయికి చేరుతున్న సమయంలో దాని నుంచి ఉపాధ్యాయుల దృష్టిని మరల్చేందుకు కొత్తచట్టాలను ప్రయోగిస్తున్నారు. 

– జేసీ రాజు, జిల్లా ప్రధానకార్యదర్శి, ఏపీటీఎఫ్‌  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top