ఉపాధ్యాయుడి దాష్టీకం

Teacher Beat Student And Escape From School in Prakasam - Sakshi

విద్యార్థికి విరిగిన బొటన వేలు

కురిచేడు: ఉపాధ్యాయుడి దాష్టీకానికి ఓ విద్యార్థి బొటన వేలు విరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జిల్లాలోని ఉప్పుగుండూరుకు చెందిన ఉప్పుటూరి మనోజ్‌ కురిచేడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గత నెల 31వ తేదీ రాత్రి అల్లరి చేస్తున్నాడంటూ పాఠశాలలోని జీవన నైపుణ్య ఉపాధ్యాయుడు కొట్టడంతో మనోజ్‌ ఎడమచేతి బొటన వేలు విరిగింది. బాధతో విలవిల్లాడుతున్నా విద్యార్థిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 2వ తేదీన మరో ఉపాధ్యాయుడు మనోజ్‌ను స్థానిక ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బాలుడిని వినుకొండ తీసుకెళ్లాలని వైద్యుడు సూచించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

వారు వచ్చేలోపు విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు పలాయనం చిత్తగించాడు. ఆ ఉపాధ్యాయుడు గతంలో కూడా చాలామంది విద్యార్థులను చితకబాదినట్లు సమాచారం. తమ బిడ్డను ఇలా కొట్టారేమిటని ప్రశ్నించిన విద్యార్థి తల్లిదండ్రులను మరో ఉపాధ్యాయుడు తీవ్ర స్థాయిలో బెదిరించాడు. అనంతరం తమ కుమారుడిని తల్లిదండ్రులు వినుకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మనోజ్‌ వేలు విరిగిందని, శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని సూచించారు. చేసేది లేక తల్లిదండ్రులు తమ కుమారుడిని ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి  శస్త్రచికిత్స చేయించి తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి ఆర్‌.వస్త్రాంనాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫోన్‌లో ప్రిన్సిపాల్‌ను వివరణ కోరారు. విద్యార్థి ఆడుకుంటూ కింద పడ్డాడని ఎంఈవోకు ప్రిన్సిపాల్‌ సమాధానమిచ్చారు.  విచారణ జరిపి విద్యార్థికి న్యాయం చేయాలని, మిగిలిన విద్యార్థులకు రక్షణ కల్పించాలని, విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిని, విద్యార్థి తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top