ఆ రోజు పోలీస్‌స్టేషన్లపై దాడులు..పచ్చ నేతల ప్రకోపమే | TDP MLAs murder case : TDP leaders Attacks On Police station | Sakshi
Sakshi News home page

ఆ రోజు పోలీస్‌స్టేషన్లపై దాడులు..పచ్చ నేతల ప్రకోపమే

Nov 18 2018 12:31 PM | Updated on Nov 20 2018 12:42 PM

TDP MLAs murder case : TDP leaders Attacks On Police station - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో సెప్టెంబర్‌ 23న మావోయిస్టులు మాటు వేసి కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను దారుణంగా కాల్చి చంపారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఘటన జరిగితే సాయంత్రం వరకు లివిటిపుట్టుకు పోలీసులు వెళ్లలేకపోవడం, డుంబ్రిగుడ ఎస్సై అమ్మనరావు వివాదాస్పద వ్యవహారశైలి నేపథ్యంలో అప్పటికే వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో కిడారి, సివేరిల మృతదేహాలను డుంబ్రిగుడ, అరకు పోలీస్‌స్టేషన్ల సమీపంలోకి తీసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. వందలాదిమంది పోలీస్‌స్టేషన్లపై దాడి చేశారు. కంప్యూటర్లు, రికార్డులు సహా ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారు.

 ఖాకీ చొక్కాలు కనిపిస్తే చాలు.. ముందూవెనుకా చూడకుండా చితక్కొట్టేశారు. ఎస్సై సురేష్‌ సహా మొత్తం 16మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత రెండు పోలీస్‌స్టేషన్లకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యోదంతంతో భావోద్వేగానికి, ఆవేశానికి లోనైన గిరిజనులే ఇదంతా చేసి ఉంటారని అందరూ భావించారు. అయితే హత్యోదంతంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. కిడారి, సివేరిల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మావోలకు చేరవేసి టీడీపీ నేతలే వారి హత్యకు సహకరించారని  బయటపడగా.. హత్యోదంతం తర్వాత పరిస్థితిని అదుపు చేయాల్సిన టీడీపీ నేతలే అమాయకులను రెచ్చగొట్టి దగ్గరుండి అరాచకాలు చేయించారని కూడా తేలింది.

అరాచకం సృష్టించింది వీరే..
పోలీస్‌స్టేషన్లపై దాడి, ధ్వంసం, దహనం కేసుకు సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న  మొత్తం 111మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితులు టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే కావడం గమనార్హం. కేసులో ఏ–2గా టీడీపీకి చెందిన అరకు జెడ్పీటీసీ కూన వనజ, ఏ–3గా ఆమె భర్త, టీడీపీ నాయకుడు కూన రమేష్, ఏ–4గా టీడీపీ ఎంపీటీసీ పి.అమ్మన్న, ఏ–5గా టీడీపీ ఎంపీటీసీ కిల్లో సాయిరాం, ఏ–6గా శెట్టి బాబూరావు, ఏ–8 గా సర్పంచ్‌ కిల్లో రఘునా«థ్, ఏ–9గా అరకు ఎంపీపీ శెట్టి అప్పాలు.. ఇలా 111 మంది నిందితుల్లో అత్యధిక శాతం టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే ఉన్నారు.
మాపై పెట్రోలు పోసి కాల్చేయాలని చూశారు..

డుంబ్రిగుడ హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ
‘ఆ రోజు పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న నన్ను, సహచర కానిస్టేబుల్‌ భాస్కరరావును పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. బండబూతులు తిట్టారు. వీరిద్దరినీ చంపేయండి.. అని కేకలు వేస్తూ పెట్రోలు క్యాన్లు ఓపెన్‌ చేసి... పెట్రోలు చల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడ్డాం. మమ్మల్ని పెట్రోలు పోసి కాల్చేందుకు ప్రయత్నించిన వాళ్ళను గుర్తుపడతాం,. ఘటనా స్థలంలో టీడీపీ జెడ్‌పీటీసీ సహా మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు. పోలీస్‌స్టేషన్లకు నిప్పంటించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, మమ్మల్ని కాల్చి చంపాలని చూసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి’.. అని డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.సత్యనారాయణ అదే పోలీస్‌స్టేషన్‌ ఎస్సైతో పాటు అరకు ఎస్సైకి ఫిర్యాదు చేశారు.

అసలు దోషులు టీడీపీ నేతలని తేలడంతో కేసును తొక్కిపెట్టిన పోలీసు అధికారులు 
గిరిజనులే ఆవేశంలో ఇదంతా చేసి ఉంటారని తొలుత పోలీసులు కూడా భావించారు. అయితే విచారణలో ఫొటోలు, వీడియో ఫుటేజీల సాక్ష్యంగా మొత్తం టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించారని తేలడంతో పోలీసులు అధికారులు నివేదికను తొట్టిపెట్టేశారు. ఇప్పటివరకు అరెస్టుల్లేకుండా కేసు విచారణను నిలిపివేశారు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌ హోం మంత్రి చినరాజప్పను కలిసి పోలీస్‌స్టేషన్‌పై దాడి, దహనం కేసులో అరెస్టుల్లేకుండా చూడాలని కోరారు. బాధ్యత గల అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించిన వైనం బట్టబయలు కావడంతో ప్రభుత్వం ఏమేరకు వ్యవహరిస్తుందో చూడాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement