వెలగపూడి టీమ్‌ రౌడీయిజం 

TDP MLA Velagapudi Team Rowdyism - Sakshi

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై  చేయిచేసుకున్న టీడీపీ నాయకుడు 

పశువులను రోడ్డుపై  కట్టినందుకు జరిమానా వేయడంపై శివాలు 

పోలీసులను ఆశ్రయించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ 

కేసు నమోదు చేయొద్దంటూ.. ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడి  

నాటకీయ పరిణామాల మధ్య కేసు నమోదు చేసిన పోలీసులు 

ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు పెట్రేగిపోతున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై రౌడీయిజం చెలాయిస్తున్నారు. గతంలో మద్యం మాఫియా వేదికగా సాగిన వీరి రౌడీయిజం ప్రస్తుతం వీధులకు సైతం పాకింది.  ఎంవీపీకాలనీ పరిధి 7వ వార్డులో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై టీడీపీ నాయకుడు దాడికి దిగడంతో తెలుగు తమ్ముళ్ల రౌడీయిజం మరోసారి వెలుగుచూసింది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు, తన రౌడీ బ్యాచ్‌ను కాపాడేందుకు ఏకంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. అటు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పైనా... ఇటు ఎంవీపీ పోలీసులపై ఒత్తిడి తెచ్చి  తెలుగు తమ్ముళ్లను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

విచక్షణ లేకుండా దాడి  
ఎంవీపీకాలనీ పరిధిలోని 7వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా త్రినాథ్‌ వ్యవహరిస్తున్నారు. సౌమ్యుడిగా.. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరుంది. ఇటీవల 7వ వార్డులో జీవీఎంసీ జోన్‌–2 కమిషనర్‌ శ్రీనివాస్‌ పర్యటించారు.  పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. సెక్టార్‌–9లో రోడ్డుపై విచ్చలవిడిగా గేదెలు కట్టి ఉండటాన్ని గమనించిన ఆయన స్థానికులతో మాట్లాడారు. దీనిపై స్థానికులు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆవులు, గేదెలను కట్టిన వారికి పెద్ద మొత్తంలో అపరాధ రుసుం విధించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ త్రినాథ్‌ను ఆదేశించారు.

ఒక్కొక్కరికి రూ.10 వేల రుసుం విధించాలని, ఆ మొత్తం చెల్లించకుంటే ఆవులు, గేదెలను తరలించాలని సూచించారు. అయితే వారు గతంలో కూడా రుసుం చెల్లింపులో ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా వేశారు. అందులో ఒకరు ఈ మొత్తం చెల్లించగా.. టీడీపీ నాయకులు ఎంవీ రమణ, పోలారావులు కట్టేది లేదంటూ ఆయనతో వాదనకు దిగారు. రుసుం కట్టకపోతే ఆవులను వ్యాన్‌ ఎక్కిస్తామని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎంవీ రమణ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశాడు. దీంతో ఆ అధికారి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎంవీపీ పోలీసులు ఎంవీ రమణ, పోలారావులను అదుపులోకి తీసుకున్నారు.  

రంగంలోకి వెలగపూడి  
ఇదిలా ఉండగా ఈ ఘటనపై సెక్టార్‌–9లోని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఆశ్రయించారు. ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే.. అనుచరుడు ఎంవీ రమణను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రమణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఎంవీపీ పోలీసులపై ఎమ్మెల్యే ఉదయం నుంచి పలుమార్లు ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలిసింది. పైగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

దీంతో  ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత వహించారు. ఉదయం నుంచి ఎంవీపీ సీఐ షణ్ముఖరావు స్టేషన్‌లో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాత్రికి విషయం బయటకు పొక్కడంతో ఎమ్మెల్యే ఒత్తిళ్లను పక్కన పెట్టి ఎట్టకేలకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారిపై దాడి చేసినందుకు గానూ రాత్రి 9.30 తర్వాత ఎంవీ రమణ, పోలారావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖరావు ధ్రువీకరించారు.

    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top