మాట వినకపోతే బదిలీయే!

TDP Leaders Revange On RDOs Kurnool - Sakshi

మంత్రి, ఎమ్మెల్యేల అధికార దర్పం

ఒకేసారి 22 మంది వీఆర్‌ఓలకు డిప్యూటేషన్‌  

ఆర్‌డీఓ పేరుతో ఉత్తర్వులు

టీడీపీ నాయకుల మాట వినలేదని కక్షపూరిత ధోరణి  

కర్నూలు, నంద్యాల: మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు మాత్రమే పని చేయాలి. కాదు.. లేదు..  అంటే మాత్రం అధికారులకు బదిలీ వేటు తప్పడం లేదు. నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఈ తంతు కొనసాగుతోంది. వీఆర్‌ఓల డిప్యూటేషన్‌ వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. సాధారణంగా గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేసే అధికారం.. డిప్యూటేషన్‌ వేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు తప్ప మరెవరికి లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 22 మంది వీఆర్‌ఓలకు నంద్యాల ఆర్‌డీఓ రామసుందర్‌రెడ్డి చేత అధికార పార్టీ నేతలు డిప్యూటేషన్‌ వేయించారు. తమ మాట వినలేదని, ప్రతిపక్ష పార్టీ నాయకులతో అనుకూలంగా ఉన్నారని ఇలా చేసినట్లు తెలుస్తోంది.  

నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో సెప్టెంబర్‌ 1 నుంచి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులను ఎవరినీ బదిలీ చేయకూడదు. ఎందుకంటే ఓటర్ల మార్పులు, చేర్పేలు, నమోదులో వీఆర్‌ఓలు బూత్‌లెవెల్‌ అధికారులుగా ఉంటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు బదిలీలు చేయకూడదు. అయితే నంద్యాల డివిజన్‌లోని 22 మంది వీఆర్‌ఓలను నంద్యాల ఆర్‌డీఓ రామసుందర్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ ఒకరోజు ముందుగా ఆగస్టు 30వ తేదీన డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు పంపారు.  టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే ఇలా చేశారనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఆరోపణలు, విధుల పట్ల నిర్లక్ష్యం ఉన్నవారిపై డిప్యూటేషన్‌పై వేస్తుంటారు. అయితే ఏకంగా నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని  22మంది వీఆర్‌ఓలను ఏ విధంగా డిప్యూటేషన్‌ వేశారనే ప్రశ్న ఉదయిస్తోంది.

టీడీపీ నేతలు ఆర్‌డీఓపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి మాటవినని వీఆర్‌ఓలను డిప్యూటేషన్‌పై బదిలీ చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీఆర్వో  రాజేశ్వరిని నూనెపల్లె నుంచి బండిఆత్మకూరు మండలం పార్నపల్లెకు, ప్రియాంకను చాపిరేవుల నుంచి గోస్పాడు మండలం యాళ్లూరు–1కు, పద్మావతిని పులిమద్ది నుంచి గడివేముల మండలం బూజనూరుకు డిప్యూటేషన్‌ వేస్తూ ఆన్‌లైన్‌లో తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా గోస్పాడు మండలం యాళ్లూరుకు చెందిన రమాకాంతరావును కోవెలకుంట్ల మండలం రేవనూరుకు, చింతకుంట్ల వీఆర్‌ఓ జనార్దన్‌ను అవుకు మండలం కునుకుంట్లకు, గడివేముల మండలం బూజనూరు వీఆర్‌ఓ వెంటకృష్ణుడును నంద్యాల మండలం పులిమద్దికి, కొలిమిగుండ్ల వీఆర్‌ఓ గూడుబాయిని కోటపాడుకు, అవుకు మండలం కునుకుంట్ల వీఆర్‌ఓ వెంకటేశ్వరరెడ్డిని చింతకుంట్లకు, శిరివెళ్ల వీఆర్‌ఓ లక్ష్మయ్యను జూలేపల్లెకు డిప్యూటేషన్‌పై బదిలీ చేసినట్లు సంబంధిత తహసీల్దార్లకు ఆర్‌డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వీరు విధుల్లో చేరాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని  ఆదేశాలు ఇచ్చారు. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించే వీఆర్‌ఓలకు డిప్యూటేషన్‌ వేయడం, అది కూడా ఆర్‌డీఓ స్థాయి అధికారి వేయడంపై రెవెన్యూ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ పాలనలో అధికారులపై అజమాయిషీ సర్వసాధారణమైందని, అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినకుంటే బదిలీలు చేస్తారంటూ అధికారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top