అర్హుల నోట్లో మట్టి! 

TDP Leaders Pension Fraud In Prakasam - Sakshi

50 ఏళ్లకే పింఛన్లు పొందడం కోసం అడ్డదారి 

టీడీపీ నాయకులు గతంలో ఒక్కో పింఛన్‌కు రూ.2 వేలు వసూలు 

నాలుగు నెలల్లో 87 మంది బోగస్‌ పత్రాలతో దరఖాస్తు 

సాక్షి, బేస్తవారిపేట: చేనేత కార్మికుడికి సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పింఛన్‌ పథకం అవినీతిమయంగా మారింది. 2017లో టీడీపీ నాయకులు పింఛన్ల కోసం కొత్తమార్గాన్ని ఎన్నుకున్నారు. చేనేత వృత్తి అంటేనే తెలియని వ్యక్తులను పింఛన్ల కోసం చేనేత కార్మికులుగా మార్చేశారు. వృత్తినే నమ్ముకున్న చేనేతలను ఎంపిక చేయాల్సిన అధికారులు టీడీపీ నాయకుల ఒత్తిడితో అనర్హులకు పట్టం కట్టారు.  

అసలు కథ ఇలా.. 
బేస్తవారిపేట మండలంలో 2015 ఏడాదికి 208, 2016కు 218 చేనేత పింఛన్లు వస్తుండేవి. 2017 నవంబర్‌లో అప్పటి ప్రభుత్వం జిల్లాకు 1985 చేనేత పింఛన్లను మంజూరు చేసింది. ఆ సమయంలోనే టీడీపీ నాయకులు వక్రమార్గాన్ని ఎంచుకున్నారు. రెండు వందలు వచ్చే పింఛన్లు వక్రమార్గంలో 456 పింఛన్లకు చేరింది. ప్రస్తుతం నెల రోజుల క్రితం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మండలంలో 66 మందికి మగ్గం ఉన్నట్లు గుర్తించారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కొందరు గ్రామ టీడీపీ నాయకులు చేనేత వృత్తి తెలియని వ్యక్తుల నుంచి వెయి నుంచి రూ.2 వేలు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు.  

నెలకు లక్షల్లో వృథా.. 
టీడీపీ ప్రభుత్వ కాలంలో నెలకు రూ.1000 పింఛన్‌ ఇచ్చేవారు. అనర్హులైన 220 మందికి నెలకు రూ.2.20 లక్షలు చెల్లించేవారు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నెలకు రూ.2,250 ఇస్తుండటంతో నెలకు రూ.5 లక్షలు ఇవ్వాల్సి వస్తోంది. అంటే ఏడాదికి రూ.60 లక్షల ప్రభుత్వ ధనం అనర్హులకు వెళుతోంది. బేస్తవారిపేట మండలంలో 2017 ఏడాది చివరి నుంచి మంజూరు చేసిన పింఛన్‌ లబ్ధిదారుల్లో చేనేత వృత్తి చేసేవారే లేరు. రాజకీయనాయకులు, బలిజ, దూదేకుల, ఎస్సీ, శెట్టి, ఉప్పర, మంగళి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు పింఛన్లు మంజూరు చేశారు. చెరకు రసం, ఇసుక వ్యాపారం, వ్యవసాయం చేసుకునే వారికి, పిల్లలు సాఫ్టవేర్‌ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాలకు పింఛన్లకు అర్హులను చేశారు. సాధారణంగా వృద్ధాప్య పింఛన్‌కు 65 ఏళ్లు ఉండాలి. చేనేత కార్మికుల పింఛన్‌కు 50 ఏళ్లు ఉన్న అర్హులు కావడంతో అడ్డదారి తొక్కారు. బీజేపీ, టీడీపీ నాయకులకు పింఛన్లలో చోటు కల్పించారు.  

చర్యలు ఏవీ.. 
పింఛన్‌ దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, చేనేత సహకార సంఘ సభ్యుని గుర్తింపు కార్డు ఉండాలి. దీంతో నేత వృత్తి తెలియని వందల మందికి చేనేత సొసైటీల నుంచి పుట్టుకొచ్చాయి. గుర్తింపు కార్డులపై చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంతకం ఉంది. చేనేతలకు గుర్తింపు కార్డును మంజూరు చేసేటప్పుడు మగ్గం ఉందా లేదా, చేనేత వృత్తి చేస్తున్నాడా లేదా అని పరిశీలించి కార్డును మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఇవేమి జరగకుండానే సామాజిక పింఛన్ల కోసం వందల సంఖ్యలో అనర్హులకు గుర్తింపు కార్డులు పుట్టుకొచ్చాయి. వీటిని తయారు చేసినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పటికీ నకిలీకార్డులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.   

ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. 
అప్పట్లో అనర్హులకు పింఛన్లు వచ్చాయని జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. చేనేత వృత్తి చేయనివారైతే మంజూరైన పింఛన్లను నిలిపివేస్తామని.. నకిలీ కార్డులు తయారు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని చేనేత, జౌలి శాఖ అధికారులు తెలిపారు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నవారి గృహ సందర్శనలు చేసి అనర్హులు ఉంటే రద్దు చేస్తామని చేనేత జౌళీశాఖ అధికారులు తెలిపారు. బేస్తవారిపేట ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నాయకులను పక్కన పెట్టుకుని తూతూమంత్రంగా సర్టిఫికెట్లను పరిశీలించి, వారిచ్చిన ముడుపులు తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వెళ్లిపోయారు.  

ఇప్పటికీ కొనసాగుతున్న దందా.. 
కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగు నెలల వ్యవధిలో మరో 90 మంది నకిలీ చేనేత గుర్తింపు కార్డులు పెట్టి పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై ఎంపీడీఓకు అనుమానం వచ్చింది. దీనికితోడు వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేయడం, ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అసెంబ్లీలో బోగస్‌ చేనేత పింఛన్లపై మాట్లాడటంతో ఎంపీడీఓ చర్యలు చేపట్టారు. దరఖాస్తుదారులు పెట్టిన 87 చేనేత గుర్తింపు కార్డులను జిల్లా చేనేత జౌళిశాఖ అధికారులకు పంపారు. అవన్నీ నకిలీవిగా తేలింది. తాము మంజూరు చేయలేదని ఎంపీడీఓకు లెటర్‌ పంపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top