పందెం కో‘ఢీ’ | TDP Leaders Participate Hen Fights in PSR Nellore | Sakshi
Sakshi News home page

పందెం కో‘ఢీ’

Jan 14 2019 2:21 PM | Updated on Jan 14 2019 2:21 PM

TDP Leaders Participate Hen Fights in PSR Nellore - Sakshi

దామరమడుగు పల్లిపాళెంలో పట్టుబడిన పందెంరాయుళ్ల వాహనాల్లో టీడీపీ నాయకుడి వాహనం(ఫైల్‌)

జిల్లాలో సంక్రాంతి కోడిపందేలకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నేతల అండ దొరికింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు లెక్కచేయని పరిస్థితి నెలకొంది. నదీ తీరప్రాంతాలతో పాటు అనుకూల ప్రాంతాల్లో కోడిపందేలను నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సై అంటున్నారు. అనుమానిత వ్యక్తుల బైండోవర్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయినా అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం:  సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు పల్లిపాళెం పెన్నానది తీరం ఒడ్డున కోడిపందేల నిర్వాహకులు వారం రోజుల కిందటే తమ అనుకూల ప్రాంతాలను సిద్ధం చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రతి ఏడాది కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. రూ.లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి చేరుకుని పందేలు నిర్వహిస్తున్నారు. విడవలూరు మండలంలోని ఊటుకూరు వెంకటరెడ్డిపాళెం గ్రామాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా కోడిపందేలు జోరుగా జరగనుంది. ఇందుకూరుపేట మండలంలోని పెన్నాతీరం వద్ద నిడిముసలి, ముదివర్తిపాళెం కోడిపందేలకు రంగం సిద్ధం చేశారు. కోవూరు మండలంలో పోతిరెడ్డిపాళెం, వేగూరులో కోడిపందేలు నిర్వహించేందుకు చూస్తున్నారు. కొడవలూరు మండలంలో గువ్వగుంట (తలమంచి సమీపంలో) ప్రాంతంలో నిర్వహించే అవకాశం ఉంది.

అధికారపార్టీ నేతల అండతోనే..
కోడిపందేలకు అడ్డురావద్దని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గతంలో అధికారులకు బహిరంగంగా సూచించిన విషయం విదితమే. దీంతో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పందేలు నిర్వహించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తమకు అనుకూలమైన ప్రాంతాలను ఎంచుకున్నారు. పందేలకు వచ్చేవారికి కూడా తామున్నామంటూ భరోసా ఇస్తున్నారు.

గతంలో పలుమార్లు ఇలా..
బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని దామరమడుగు పల్లిపాళెం పెన్నానది తీరం ఒడ్డున ప్రతి ఏటా కోడిపందేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతికి ముందుకుగానే 2015 డిసెంబరులో స్థానికులు కోడిపందేల నిర్వాహకులను, ఆడేవారిని పోలీసులకు పట్టించా రు. 45 వాహనాలను స్టేషన్‌కు తరలించారు. 2014లో వవ్వేరులో జరుగుతున్న కోడిపందేలను అడ్డుకుని నిర్వాహకులను సీఐ సాంబ శివరావు పట్టుకున్నారు. కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట ప్రాంతాల్లో మాత్రం ప్రతి ఏటా జరుగుతున్నా పోలీసులు పట్టించుకున్న దాఖలాల్లేవు. కొడవలూరు మండలంలోని 2014లో గువ్వగుంట, 2016లో కూనంపాడు ప్రాంతాల్లో జరిగిన కోడిపందేలపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. యల్లాయపాళెంలో కోడిపందేలను ఎస్సై అంజిరెడ్డి దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 13 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
కోడిపందేలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కోడిపందేలు నిషేధమని, చట్టరీత్యాల చర్యలు తప్పవని బోర్డులో పేర్కొన్నారు. అయినా కాగులపాడు సమీపంలోని పొలాల్లో ఆదివారం కోడిపందేలు నిర్వహించారు.

పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
కోడిపందేలపై నిషేధం ఉంది. ఎవరూ నిర్వహించరాదు. నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. పేకాట ఆడినా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిఘా ముమ్మరం చేశాం. ప్రజలు తమకు తెలిస్తే 9440796329కు ఫోన్‌ చేయగలరు.   –బి.సురేష్‌బాబు, సీఐ, బుచ్చిరెడ్డిపాళెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement