ఫ్యాన్‌ వైపు టీడీపీ నేతల చూపు..

Tdp Leaders Look Towards Ysrcp - Sakshi

టీడీపీ నుంచి ద్వితీయ శ్రేణి నేతల వలసలు  

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డికి ప్రజాధారణ పెరగడంతోపాటు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీలోని అసంతృప్తి నేతలు కూడా ప్రతిపక్షపార్టీలోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవల టీడీపీ నుంచి జిల్లావ్యాప్తంగా  వలసలు జోరందుకున్నాయి. నెల్లూరు నగరంలో వాణిజ్య విభాగాల్లో కీలక నేతగా ఉన్న సన్నపరెడ్డి పెంచలరెడ్డి సారధ్యంలో పలు వాణిజ్య విభాగ నేతలు మంగళవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

దీంతో నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌తోపాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీకి బలం చేకూరనుంది. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద వైఎస్సార్‌సీపీ అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. ఆమె రాకతో వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీకి కొలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీకి అదనపు బలం సమకూరింది. వీరితోపాటు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి సమక్షంలో ఎన్‌ఆర్‌ఐల చేరికతో కూడా పార్టీకి మరింత పట్టు పెరిగింది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు సమీప బంధువు శ్రీనివాసులునాయుడు స్థానిక ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేమైంది.

ఉదయగిరి, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అదే జోరు
ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి వలసల జోరు కొనసాగుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కలిగిరి మండల నేత మెట్టుకూరు చిరంజీవిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరనుండడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, కొండాపురం మండలాల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగలనుంది. అలాగే కావలి నియోజకవర్గంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ సోమశిల ప్రాజెక్ట్‌ చైర్మన్‌ కండ్లగుంట మధుబాబునాయుడు, మరో సీనియర్‌ నేత శిరోçమణి, టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ అధికార ప్రతినిధి ఎంఏ రవికుమార్‌ కూడా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడంతో కావలి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద షాక్‌ తగిలింది. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మంత్రి సోమిరెడ్డి వ్యవహారశైలిపై విసుగుపుట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతిరోజూ వైఎస్సార్‌సీపీకి చేరువవుతున్నారు. 

టీడీపీకి గుడ్‌బై చెప్పనున్న నేతలు 
టీడీపీ ఐదేళ్ల పాలనలో పదవుల హామీలతో మభ్యపెడుతూ చివరకు హ్యాండివ్వడంతో నెల్లూరు నగర, రూరల్‌ పరిధిలోని పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ సీనియర్‌ నేత, కార్పొరేటర్‌ నూనె మల్లికార్జునయాదవ్‌ ఆ పార్టీకి రాంరాం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ నేతగా గుర్తింపు ఉన్న నూనె మల్లికార్జునయాదవ్‌కు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కలేదు.

ఆయన వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నూనెకు ప్రాధాన్యత ఇవ్వకపోగా పదవులు ఇప్పిస్తామంటూ జిల్లా టీడీపీ పెద్దలు మోసం చేయడంపై ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల నూనెను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ అవి ఫలించలేదు. అలాగే సీనియర్‌ మహిళా నేత నువ్వుల మంజులకు కూడా పార్టీలో తీవ్ర అవమానం జరిగింది. టీడీపీని నమ్ముకున్న నువ్వుల మంజులను ఇటీవల నామినేటడ్‌ పదవుల పందేరంలో కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురై త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయినట్లు ప్రచారం ఉంది. టీడీపీలో సీనియర్‌ నేతగా గుర్తింపు ఉన్న దేశాయిశెట్టి హనుమంతరావుకు కూడా తీవ్ర అవమానం జరగడంతో ఆయన కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలిసింది. టీడీపీ నుంచి రోజురోజుకూ వలసలు జోరందుకోవడంతో ఆ పార్టీ కేడర్‌లో నిరుత్సాహం నెలకొంటోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top