అంతా మా ఇష్టం!

ఇదీ అధికార పార్టీ నేతల తీరు 

ఇరిగేషన్‌లో మర్రెడ్డికి ఉత్తర్వులు ఇచ్చారు

 చేరిన రోజే రద్దు చేయించారు 

 అధికారుల్లో భయాందోళనలు  

 అక్రమాలు బయటపడతాయనే ఉత్తర్వులు రద్దు  

కడప సిటీ : మేం అధికారంలో ఉన్నాం...మేం చెప్పినట్లే జరగాలి, పనులు చేయాలి.. అలా వినకపోతే ఉద్యోగాలు చేయలేరు.. మా ఇష్టం లేకుండా ఏ ఉద్యోగి వచ్చినా మాకున్న అధికార బలంతో చేరిన రోజే ఆర్డర్‌ రద్దుచేయించే సత్తా మాకుంది. ఇదీ జిల్లాలో అధికార పార్టీ నేతల తీరు!. ఇందుకు నిదర్శనం ఇరిగేషన్‌ శాఖలో బద్వేలు డీఈగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చి విధుల్లో చేరిన రోజే తెలుగు తమ్ముళ్లు ఉత్తర్వులను రద్దు చేయించారు. దీంతో జిల్లాలోని అధికారులు కొన్నిచోట్ల ఉద్యోగాలు చేయాలంటేనే భయపడుతున్నారు. మరికొంతమంది సెలవుపై వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తోంది. జిల్లాలో తెలుగుతమ్ముళ్లు నీరు–చెట్టు కింద కోట్లాది రూపాయల విలువజేసే పనులను చేశారు. అందులోభాగంగా బద్వేలు ప్రాంతంలో కూడా ఈ పనులు చేపట్టారు. ఈ నేపథ్యలో అక్కడ డీఈగా ఉన్న ఎంవీ రమణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో అక్కడ పోస్టు ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని పోరుమామిళ్ల సబ్‌ డివిజన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌.మర్రెడ్డిని నియమించారు.

విషయాలు బయటపడతాయనే...
నీరు–చెట్టు కింద అధికారపార్టీ నేతలు ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా పనులు చేశారు. వాటికి బిల్లులు చేసుకోవాలంటే తమకు అనుకూలంగా ఉన్న అధికారి అయితే ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఏసీబీకి పట్టుబడిన డీఈ ఎంవీ రమణారెడ్డి జైలులో ఉండగా ఫైళ్లలో సంతకాలు పెట్టించుకునేందుకు తమ్ముళ్లు ప్రయత్నించారు. కానీ వీలు పడకపోవడంతో మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో వారు చేసిన నాసిరకం పనులను గుర్తించి బిల్లులు చేయకుండా కొత్త అధికారి ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో మర్రెడ్డిని బాధ్యతలు తీసుకున్న ఆరోజునే ఉత్తర్వులను అధికారపార్టీ  నేతలు రద్దు చేయించారు. ఫుల్‌ అడిషనల్‌ బాధ్యతలకు సంబంధించి ఉత్తర్వులు తీసుకుని విధుల్లో చేరిన రోజునే వెనక్కి పంపారు. ఉన్నతాధికారులు దీనికి వంత పాడుతూ హుకుం జారీ చేసి వెళ్లిపోమ్మన్నారు. 

ఉన్నతాధికారులు ఉత్తర్వులు చూపలేదు
మర్రెడ్డికి బద్వేలు డీఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అక్టోబరు 10న ప్రొసీడింగ్‌ నంబరు ఆర్‌సీ/ఈఎన్‌సీ(పురపాలన)/సీ2/2017 1024/2017 ద్వారా జలవనరులశాఖ పరిపాలన ఇంజనీరింగ్‌ చీఫ్‌ ఎం.గిరిధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మర్రెడ్డితోపాటు ఎస్‌ఈకి కూడా ఈ ఉత్తర్వులు అందాయి. దీంతో అక్టోబర్‌ 25న మర్రెడ్డి ఉన్నతాధికారులను కలిసినట్లు సమాచారం. అయితే తమకు ఉత్తర్వులు అందలేదని ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి తెలియజేయడంతో మర్రెడ్డి పలుమార్లు వారు చుట్టూ తిరిగినప్పటికీ స్పందించనట్లు తెలిసింది.

చేరిన ఒక్కరోజుకే ఉత్తర్వులు రద్దు
మర్రెడ్డి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆ‹ఫ్‌ చార్జ్‌ (సీటీసీ) అనుసరించి ఈనెల 15న బాధ్యతలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు పలకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే తెరవెనుక రాజకీయాలు మొదలయ్యాయి. ఉన్నతాధికారుల ద్వారా విడుదలైన ఉత్తర్వులను ఈనెల 7న రద్దయినట్లు ఇంకొక ఉత్తర్వును తెప్పించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 16న కడప కార్యాలయానికి రావడం, అంతకు ముందురోజు విధుల్లో చేరిన మర్రెడ్డిని తొలగించడం గంటల్లో జరిగిపోయాయి. ముందు వచ్చిన ఉత్తర్వులు చూపకుండా కేవలం రద్దయిన ఉత్తర్వులను మాత్రమే అధికారులు చూపించడం వెనుక పెద్ద రాజకీయమే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మర్రెడ్డి మాత్రం తాను విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్‌ఈ గోపాలరెడ్డిని వివరణ కోరగా ఉత్తర్వులు ఇచ్చింది వాస్తవమేనని, తిరిగి ఈఎన్‌సీ అధికారులే వాటిని రద్దు చేశారని ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top