నిధుల మేత! | TDP Leaders Corruption Watershed Works In Kurnool | Sakshi
Sakshi News home page

నిధుల మేత!

Aug 9 2018 11:52 AM | Updated on Aug 11 2018 4:24 PM

TDP Leaders Corruption Watershed Works In Kurnool - Sakshi

ఇది ఆదోని మండలం గోనబావి గ్రామం వద్ద నిర్మించిన చెక్‌డ్యాం. ఈ ప్రాంతంలో చెక్‌డ్యాం నిర్మాణానికి అనువుగా లేనప్పటికీ అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పోనీ పూర్తిగానైనా నిర్మించారా అంటే అదీ లేదు. అడ్డంగా ఓ కట్ట కట్టేసి..మిగిలిన పనులను ఇలా వదిలేశారు. రూ.లక్షకు పైగా నిధులను దుర్వినియోగం చేశారు. మండగిరి వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులో అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తే..ఇలాంటి లీలలు ఎన్నో బయటపడతాయి.  

ఆదోని రూరల్‌(కర్నూలు): వాటర్‌షెడ్‌ పనుల్లో అవి‘నీటి’ ప్రవాహం కొనసాగుతోంది. జల సంరక్షణ పనులను తూతూమంత్రంగా చేపట్టి నిధులు కొల్లగొడుతున్నారు. మరికొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నేతలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర బయటపడుతోంది. కొన్ని నెలల క్రితం కౌతాళం మండలం హాల్వి వాటర్‌షెడ్‌ పనుల్లో భారీ అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ఇందుకు బాధ్యులైన ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ (పీఓ), టెక్నికల్‌ ఆఫీసర్‌ (టీఓ), జేఈ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆదోని మండలం మండగిరి వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులోనూ ఇంతకు రెట్టింపు స్థాయిలో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.

వాటర్‌షెడ్‌ కమిటీ చైర్మన్లుగా వ్యవహరించిన స్థానిక సర్పంచులు, అధికారులు, సిబ్బంది కలిసి నిధులు స్వాహా చేసినట్లు విమర్శలొస్తున్నాయి. నాసిరకం, అరకొర, అసలు పనులు చేయకుండానే..ఇలా పలు రూపాల్లో డబ్బు కాజేసినట్లు తెలుస్తోంది. త్వరలో సామాజిక తనిఖీ ఉండడంతో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన వారిలో మొదలైంది. ముఖ్యంగా అధికారులు, సిబ్బంది పనులు చేసిన అధికార పార్టీ నేతలతో చర్చిస్తూ.. ఎలాగైనా తమ ఉద్యోగాలు పోకుండా చూడాలని వేడుకుంటున్నట్లు వినికిడి. ‘అధికారం మాది.. ఎవరూ ఏమీ చేయలేరు. అండగా మేమున్నాం’ అంటూ సదరు నేతలు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 సంరక్షణ మరచి స్వాహాపర్వం 
వర్షపు నీటిని ఒడిసిపట్టుకొని భూమిలోకి ఇంకేలా చేసేందుకు ప్రభుత్వం సమగ్ర వాటర్‌షెడ్‌ యాజమాన్య కార్యక్రమం (ఐడబ్ల్యూఎంపీ) ప్రవేశపెట్టింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోంది. రైతుల పొలాల్లో ఫాంపాండ్స్, డగౌట్స్, భూమి కోత నివారణకు రాతి కట్టడాల నిర్మాణం.. తదితర పనులను చేపట్టాల్సి ఉంటుంది. ఐడబ్ల్యూఎంపీ కింద మండగిరి వాటర్‌షెడ్‌ ప్రాజెక్టును 2011లో ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో మండిగిరి, సాదాపురం, విరుపాపురం, గోనబావి, దిబ్బనకల్, బైచిగేరి, ఎస్‌.కొండాపురం గ్రామాలు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా బండరాళ్లు, ఎరువు దిబ్బల తొలగింపు పనులు, ఫాంపాండ్స్, డగౌట్‌ పాండ్స్, చెక్‌వాల్, చెక్‌డ్యాంల నిర్మాణం, మరమ్మతు పనులు మంజూరయ్యాయి.

బండరాతి తొలగింపు పనులు–2కు గాను రూ.19 వేలు, ఎరువుదిబ్బ పనులకు రూ.15లక్షల 36వేలు, ఫాంపాండ్స్‌కు రూ.2.60 కోట్లు, డగౌట్‌ పాండ్స్‌కు రూ.9.66 కోట్లు, చెక్‌వాల్‌ పనులకు రూ.7.95 కోట్లు, చెక్‌డ్యాం పనులకు రూ.53.36 కోట్లు,  చెక్‌డ్యాంల మరమ్మతులకు రూ.21.38కోట్లు,  చెక్‌వాల్స్‌ రిపేరీకి రూ.2.87 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ పనులన్నీ ప్రాజెక్టు పరిధిలోని ఐదు పంచాయతీల సర్పంచుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సర్పంచులందరూ అధికార పార్టీ మద్దతుదారులే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. అడిగేవారు ఎవరన్నట్లు నాసిరకంగా, అరకొరగా, ఉపయోగం లేనిపనులను చేపట్టి జేబులు నింపుకున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం తమ వాటాను తీసుకొని మిన్నకుండిపోయారు. 

అక్రమాలకు కొన్ని ఉదాహరణలు 
విరుపాపురం గ్రామం వద్ద గొల్లకుంట వంకలో చెక్‌డ్యాం నిర్మాణ పనులకు గాను రూ.1.10 లక్షలతో బాడీవాల్, సైడ్‌వాల్‌ను నిర్మించారు. ఇది అనతికాలంలోనే బీటలు బారి..తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇదే ప్రాంతంలో చెక్‌డ్యాం రిపేరీ పేరుతో అరకొర పనులు చేసి రూ.95 వేలు కాజేశారు.  

తంగరడోణ రోడ్డులో రైతు శివమ్మ  పొలంలో రూ.80వేలు, శాంతప్ప పొలంలో రూ.1.50లక్షలతో ఫాంపాండ్‌లు నిర్మించినట్లు రికార్డుల్లో ఉంది. ఫాంపాండ్‌ను 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, ఏడడుగుల లోతుతో నిర్మించాల్సి ఉండగా.. 3 అడుగుల లోతు కూడా లేదు. మండిగిరి బైపాస్‌రోడ్డు, సాదాపురం, ఎస్‌.కొండాపురం, దిబ్బనకల్‌ గ్రామాల్లోనూ ఇదే తరహాలో పనులు జరిగాయి. పనులు జరిగిన చోట తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేసి.. పని అంచనా, ఖర్చు, పనిచేసిన వ్యక్తి, ప్రాంతం తదితర వివరాలు పేర్కొనాలి. అయితే.. అవి ఎక్కడా కనిపించడం లేదు.   

అధికారులు, తమ్ముళ్లకు వరం
వాటర్‌షెడ్‌ పనులు రైతులకు, కూలీలకు ఏమాత్రమూ ఉపయోగపడలేదు.  కేవలం అధికార పార్టీ నేతలకు, అధికారులకు వరంగా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అంతులేని అవినీతి జరిగింది. ఈ విషయంపై మేం కూడా పరిశీలిస్తున్నాం. త్వరలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతాం. – రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ కార్యదర్శి 

ఉపయోగం లేని పనులు చేశారు
వాటర్‌షెడ్‌ పనుల వల్ల రైతులకు ఉపయోగం ఉంటుందని చెబుతూ రూ.కోట్లలో ఖర్చు పెడుతున్నారు. అయితే..ఇవి ఎక్కడా రైతులకు ఉపయోగపడడం లేదు. విరుపాపురం, గోనబావి సమీపంలో చేసిన పనులు పూర్తిగా నిష్ప్రయోజనం.  
– నర్సప్ప, రైతు సంఘం డివిజన్‌ కార్యదర్శి 

ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం
నాసిరకం, ఉపయోగం లేని పనులు, అవినీతి, అక్రమాల విషయం నాకు తెలీదు. నేను ఇటీవలే ఇన్‌చార్జ్‌ పీఓగా బాధ్యతలు తీసుకున్నా. ఎక్కడైనా ఇలాంటివి జరిగినట్లయితే విచారణ చేసి.. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం.  – నూర్జహాన్, ఇన్‌చార్జ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌

1
1/1

విరుపాపురం సమీపంలో బీటలు బారిన చెక్‌డ్యాం సైడ్‌వాల్‌, తంగరడోణ రోడ్డులో అరకొరగా తవ్విన ఫాంపాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement