నిన్న కేశినేని.. నేడు యలమంచిలి

నిన్న కేశినేని.. నేడు యలమంచిలి - Sakshi


అధికార పార్టీలో ఆగని మాటల తూటాలు

నేడు గద్దెపై యలమంచిలి రవి తీవ్ర ఆరోపణలు

అధినేత వద్ద పంచాయితీలు


 

విజయవాడ : జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆదిపత్యపోరు తారాస్థాయికి చేరింది.  జిల్లాలో ఎవరికి వారు తమ మాట నెగ్గాలని, తాను చెప్పినట్లు అధికారులు పనిచేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నేతల నోటి నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాష్ట్ర డీజీపీ కూడా ‘ఎవరో.. ఏవేవో మాట్లాడుతుంటారు. వాటన్నింటినీ పట్టించుకోవాలా?..’ అంటూ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించారు. నాని వ్యాఖ్యలపై పార్టీ అధినేత, సీఎం చర్చలు జరుపుతుండగానే శనివారం ఉదయం పటమట రైతు బజారులో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై పలు ఆరోపణలు చేశారు. ఆయన వర్గం డబ్బులకు షాపులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. తన అనుచరులను రైతుబజారు నుంచి బయటకు పంపిస్తూ గద్దె అనుయాయులకు షాపులు కేటాయిస్తున్నారని యలమంచిలి ఆరోపించారు.



ప్రజా సంక్షేమం గాలికొదిలి...



ప్రజాసంక్షేమం గురించి టీడీపీ ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. ఎవరికి వారు అధికారులపై ఆధిపత్యం సాధించేందుకు పథకం ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఎంపీ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని అధిష్టానం ఆయన్ని వెంటనే హైదరాబాద్ పిలిపించింది. సీఎం చంద్రబాబు స్వయంగా ఎంపీతో మాట్లాడారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అధికారులకు తాను చెబుతానని, వారి సహకారం ఉంటుందని నానీకి సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఆగ్రహం చల్లారింది. చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చిన ఎంపీ తాను పబ్లిక్‌లో కాకుండా పార్టీ నేతల వద్దే మాట్లాడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహాన్ని ఒక్కసారి వెళ్లగక్కడం, ఆ తరువాత సీఎం సర్దిచెప్పడంతో తాత్కాలికంగా పరిస్థితి చక్చబడింది. అయితే, తన మాటలు అధికారులు పట్టించుకోవడం లేదనే కోపంతోనే పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయటపెట్టినట్లు ఎంపీ కేశినేని నాని చెప్పడం ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

 

ఎన్నికల ముందు నుంచే వైరం



ఎన్నికలకు ముందు నుంచే దేవినేని ఉమాకు, కేశినేనికి మధ్య స్పర్థలున్నా యి. పార్టీ అధికారంలోకి రావడం, ఉమాకు మంత్రి పదవి దక్కడంతో అధికారులు ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ఎంపీ పిలిచినా పట్టించుకోవద్దని, ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుంటారు..’ అని పలువురు అధికారుల వద్ద ఉమా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ విషయాలు తెలుసుకున్న ఎంపీ కేశినేని జిల్లా ఉమా జాగీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా ఎంపీ కేశినేని నానికి అనుకూలంగా ఉన్నారు. నాని వ్యాఖ్యలపై మంత్రి కొల్లు కూడా పలువురి వద్ద సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

 

ఎం వద్దకు వెళ్లేందుకు యలమంచిలి సిద్ధం!


 

ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ గెలుపు కోసం శ్రమించారు. మొదటి నుంచి తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని, ఈ విషయాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకుంటానని పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్నారు. రవి మాటలను పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన శనివారం ఉదయం తనకు అన్యాయం జరుగుతోందని, తనతోపాటు వచ్చిన వారిని ఎక్కడా ఏ పనీ చేయనీయకుండా టీడీపీ వారే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యవహార శైలిపై సోమవారం చంద్రబాబు వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

 

నలిగిపోతున్న అధికారులు

 

టీడీపీ ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారు. మంత్రికి సమాధానం చెప్పుకోలేక, ఎమ్మెల్యేలకు ఏంచెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నారు. ఏ విషయమైనా తనకు తెలియకుండా చేయొద్దంటూ ఉమా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ ఏకంగా బయటపడి మాట్లాడారు. పలువురు ఎమ్మెల్యేలు త్వరలోనే సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖలో ఏ తనిఖీలు, సమీక్షలు నిర్వహించినా ముందుగా తనకు తెలియజేయాలని మంత్రి కామినేని శ్రీనివాస్ హుకుం జారీచేయడంతో ఆ శాఖ జోలికి మాత్రం ఉమా వెళ్లడం లేదని సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top