టీడీపీ నేతల వీరంగం | tdp leaders attacks on police | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల వీరంగం

Jul 6 2014 3:30 AM | Updated on Aug 10 2018 9:40 PM

పోలీసులతో వాగ్వాదానికి దిగిన కరణం బలరాం - Sakshi

పోలీసులతో వాగ్వాదానికి దిగిన కరణం బలరాం

జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

- ప్రాంగణంలోకి కార్యకర్తలతో చొచ్చుకొచ్చిన బలరాం
- అక్కడే రభస సృష్టించిన ఆయన తనయుడు
- పోలీసులపై 500 మంది టీడీపీ కార్యకర్తల దాడి
- ఎస్పీ డ్రైవర్‌కు, గన్‌మెన్‌కు గాయాలు
 - ఎస్పీని సైతం దుర్భాషలాడిన టీడీపీ నేతలు

 ఒంగోలు టౌన్: జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల వీరంగం సామాన్యులను సైతం భయభ్రాంతులకు గురిచేసింది. సమావేశ మందిరం ప్రాంగణంలోకి నాయకులు, కార్యకర్తలు చొచ్చుకొచ్చి రసాభాస సృష్టించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కార్యకర్తలతో కలిసి దౌర్జన్యంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చారు. పోలీసుల భద్రతా వలయాలను సైతం ఛేదించుకుని లోనికి వచ్చిన టీడీపీ నేతలు నానా రభస సృష్టించారు. కరణం బలరాంతో పాటు ఆయన తనయుడు వెంకటేష్‌తో వచ్చిన నాయకులు,కార్యకర్తలు చివరకు పోలీసులపై దాడికి దిగారు.

500 మంది కార్యకర్తలతో వచ్చిన టీడీపీ నేతలను అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. సమావేశ మందిరం ముందుకు చొచ్చుకొచ్చిన టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. ఎదురొచ్చిన పోలీసులపై దాడికి దిగటంతో పాటు నానా దుర్భాషలాడారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ అక్కడకు చేరుకున్నారు. దీంతో భయానక వాతావరణం సృష్టించేందుకు ముందుగా రచించుకున్న పథకం ప్రకారం ఎస్పీ డ్రైవర్ రామకృష్ణపై, గన్‌మెన్‌పై దాడికి దిగారు.

రక్తం కారేటట్లు కొట్టారు. దీనిని ఎస్పీ తీవ్రంగా పరిగణించి ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. దాదాపు జెడ్పీ సమావేశహాలు బయట ఒక యుద్ధవాతావరణమే నెలకొంది. ప్రత్యేక పోలీస్ దళాలు, ఇటు వందల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దాదాపు గంటకుపైగా సమావేశం హాలు ముందు భయానక వాతావరణమే నెలకొంది. ఎస్పీ డ్రైవర్, గన్‌మెన్‌పై దాడి చేయడంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో లాఠీచార్జికి దిగారు.

దీంతో బలరాంతో పాటు ఆయన తనయుడు వెంకటేష్ పోలీసులపై దాడికి దిగడంతో పాటు దుర్భాషలాడుతూ నానా యాగీ సృష్టించారు. ఒక సందర్భంలో ఎస్పీ ప్రమోద్‌కుమార్‌ను సైతం దుర్భాషలాడేందుకు బలరాం వెనుకాడలేదు. ‘అధికారం మా చేతిలో ఉంది..ఖబడ్దార్’ అంటూ.. ఎస్పీని ఉద్దేశించి బలరాం అనటంతో కార్యకర్తలు ఇంకా రెచ్చిపోయారు.

పథకం ప్రకారమే...
టీడీపీ నేతలు జిల్లా జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీకి ఎక్కడ పోతుందోనన్న భయంతో ఒక పథకం ప్రకారం ఎన్నికలు జరుగుతున్న జిల్లాపరిషత్ సమావేశం హాలు ముందు తీవ్రస్థాయిలో దాడికి ప్రయత్నించారు. ఒక సందర్భంలో చొచ్చుకొని వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నిక జరుగుతున్న సమావేశం హాలులోకి వెళ్లి మరీ దొరికిన వారిని దొరికినట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, జెడ్పీటీసీ సభ్యులపై దాడి చేసి కొట్టాలని పథకరచన చేశారు. అయితే ఈ విషయం పసిగట్టిన పోలీసులు సమావేశ మందిరానికి చెందిన గేటుకు లోపలి వైపు తాళం వేసి లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఎన్నిక సందర్భంగా అద్దంకి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై దాడి చేశాడంటూ బయట అసత్యప్రచారం జరిగింది. ఇది నిజమేనని నమ్మిన బలరాం, అతని అనుచరులు వందల మందితో లోనికి చొచ్చుకుని వచ్చారు. ప్రాంగణంలో
నానా బీభత్సం సృష్టించారు.
 
మాజీ ఎమ్మెల్యేల దుందుడుకు...

సమావేశ మందిరం ముందు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల దుందుడుకుతనం కార్యకర్తలు రెచ్చిపోవడానికి, పోలీసులపై దాడి చేయటానికి కారణంగా మారింది. బలరాంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, అన్నా రాంబాబు, కందుల నారాయణరెడ్డిలు కార్యకర్తలు రెచ్చిపోయేలా అరుపులు, కేకలతో నానా బీభత్సం సృష్టించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement