breaking news
balarama krishna murthy
-
పాదరక్షలతో జనసేన ఎమ్మెల్యే దీక్ష?
తూర్పు గోదావరి జిల్లా: సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ స్పీచులిస్తూంటారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాదరక్షలు ధరించి చండీ దీక్షలో ఉండటం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. రాజానగరం మండలం దివాన్ చెరువులో బుధవారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీలో పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల పాల్గొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన పాదరక్షలు ధరించి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దేవాలయాలకు వెళ్లిన సమయంలో పలు విమర్శలు గుప్పించే కూటమి నేతలు హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
కరణం దూకుడు
ఒంగోలు క్రైం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లపై పోలీసులు కేసులు నమోదు చేయడం వరకే పరిమితం కావడం పలు విమర్శలకు తావిస్తోంది. స్వయానా ఎస్పీ గన్‌మెన్‌పై దాడి చేస్తేనే తామేమీ చేయలేదని, ఇప్పుడు మాత్రం అంతకన్నా ఏం జరుగుతుందని కిందిస్థాయి పోలీసు సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు అరెస్టు చేయడం విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై కేసులుంటే ఆగమేఘాలపై అరెస్టు చేసి కోర్టుకు పెట్టే పోలీసులు అధికార పార్టీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. గత ఏడాది జులై 5న పాత జెడ్పీ కార్యాలయం వద్ద కరణం బలరామ్, ఆయన కుమారుడు వెంకటేష్ వీరంగం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్ కారు డ్రైవర్‌పై దాడి చేసి రక్తం కారేట్లు కొట్టారు. దీంతోపాటు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న కాన్ఫరెన్స్ హాలులోకి బలవంతంగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మీదకే ఆ దూకుడు ప్రదర్శించారు. ఆ రోజు బలరాం, వెంకటేష్‌లతోపాటు మరి కొంత మందిపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 143, 448, 353, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆరు నెలల 10 రోజులు కావస్తోంది. కేసు అయితే పోలీస్ అధికారులు నమోదు చేశారే గానీ, తదుపరి చర్యలు మాత్రం గాలికి వదిలేశారు. ఇంత వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు ఏ విధంగా తమ స్వామిభక్తిని ప్రదర్శించుకుంటున్నారో ఈ కేసు పురోగతిని పరిశీలిస్తే అర్థమవుతోంది. సోమవారం ప్రకాశం భవనంలో గుండ్లకమ్మ నిర్వాసితుల ఇళ్ల పట్టాల అంశంపై సమావేశం ముగిసిన తర్వాత బలరాం ఆయన తనయుడు వెంకటేష్ తన అనుచరులతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పూనుకోవడం, కారు అద్దాలు పగులగొట్టడం, రవికుమార్ అనుచరుడు మందపాటి సురేష్ తలకు బలమైన గాయమయ్యేలా కొట్టడం లాంటివి చకచకా జరిగిపోయాయి. కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతున్నా బందోబస్తు నిర్వహించాల్సిన టూటౌన్ పోలీసుల జాడే లేదు. ఘటన తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు ఏమి జరిగిందనే విషయాన్ని మీడియా నుంచి సమాచారం సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బలరామ్ అనుచరులు ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకుని ‘మమ’ అనిపించారు. -
టీడీపీ నేతల వీరంగం
- ప్రాంగణంలోకి కార్యకర్తలతో చొచ్చుకొచ్చిన బలరాం - అక్కడే రభస సృష్టించిన ఆయన తనయుడు - పోలీసులపై 500 మంది టీడీపీ కార్యకర్తల దాడి - ఎస్పీ డ్రైవర్‌కు, గన్‌మెన్‌కు గాయాలు - ఎస్పీని సైతం దుర్భాషలాడిన టీడీపీ నేతలు ఒంగోలు టౌన్: జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల వీరంగం సామాన్యులను సైతం భయభ్రాంతులకు గురిచేసింది. సమావేశ మందిరం ప్రాంగణంలోకి నాయకులు, కార్యకర్తలు చొచ్చుకొచ్చి రసాభాస సృష్టించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కార్యకర్తలతో కలిసి దౌర్జన్యంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చారు. పోలీసుల భద్రతా వలయాలను సైతం ఛేదించుకుని లోనికి వచ్చిన టీడీపీ నేతలు నానా రభస సృష్టించారు. కరణం బలరాంతో పాటు ఆయన తనయుడు వెంకటేష్‌తో వచ్చిన నాయకులు,కార్యకర్తలు చివరకు పోలీసులపై దాడికి దిగారు. 500 మంది కార్యకర్తలతో వచ్చిన టీడీపీ నేతలను అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. సమావేశ మందిరం ముందుకు చొచ్చుకొచ్చిన టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. ఎదురొచ్చిన పోలీసులపై దాడికి దిగటంతో పాటు నానా దుర్భాషలాడారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ అక్కడకు చేరుకున్నారు. దీంతో భయానక వాతావరణం సృష్టించేందుకు ముందుగా రచించుకున్న పథకం ప్రకారం ఎస్పీ డ్రైవర్ రామకృష్ణపై, గన్‌మెన్‌పై దాడికి దిగారు. రక్తం కారేటట్లు కొట్టారు. దీనిని ఎస్పీ తీవ్రంగా పరిగణించి ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. దాదాపు జెడ్పీ సమావేశహాలు బయట ఒక యుద్ధవాతావరణమే నెలకొంది. ప్రత్యేక పోలీస్ దళాలు, ఇటు వందల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దాదాపు గంటకుపైగా సమావేశం హాలు ముందు భయానక వాతావరణమే నెలకొంది. ఎస్పీ డ్రైవర్, గన్‌మెన్‌పై దాడి చేయడంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో లాఠీచార్జికి దిగారు. దీంతో బలరాంతో పాటు ఆయన తనయుడు వెంకటేష్ పోలీసులపై దాడికి దిగడంతో పాటు దుర్భాషలాడుతూ నానా యాగీ సృష్టించారు. ఒక సందర్భంలో ఎస్పీ ప్రమోద్‌కుమార్‌ను సైతం దుర్భాషలాడేందుకు బలరాం వెనుకాడలేదు. ‘అధికారం మా చేతిలో ఉంది..ఖబడ్దార్’ అంటూ.. ఎస్పీని ఉద్దేశించి బలరాం అనటంతో కార్యకర్తలు ఇంకా రెచ్చిపోయారు. పథకం ప్రకారమే... టీడీపీ నేతలు జిల్లా జెడ్పీ పీఠం వైఎస్సార్సీపీకి ఎక్కడ పోతుందోనన్న భయంతో ఒక పథకం ప్రకారం ఎన్నికలు జరుగుతున్న జిల్లాపరిషత్ సమావేశం హాలు ముందు తీవ్రస్థాయిలో దాడికి ప్రయత్నించారు. ఒక సందర్భంలో చొచ్చుకొని వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నిక జరుగుతున్న సమావేశం హాలులోకి వెళ్లి మరీ దొరికిన వారిని దొరికినట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, జెడ్పీటీసీ సభ్యులపై దాడి చేసి కొట్టాలని పథకరచన చేశారు. అయితే ఈ విషయం పసిగట్టిన పోలీసులు సమావేశ మందిరానికి చెందిన గేటుకు లోపలి వైపు తాళం వేసి లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఎన్నిక సందర్భంగా అద్దంకి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై దాడి చేశాడంటూ బయట అసత్యప్రచారం జరిగింది. ఇది నిజమేనని నమ్మిన బలరాం, అతని అనుచరులు వందల మందితో లోనికి చొచ్చుకుని వచ్చారు. ప్రాంగణంలో నానా బీభత్సం సృష్టించారు. మాజీ ఎమ్మెల్యేల దుందుడుకు... సమావేశ మందిరం ముందు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల దుందుడుకుతనం కార్యకర్తలు రెచ్చిపోవడానికి, పోలీసులపై దాడి చేయటానికి కారణంగా మారింది. బలరాంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, అన్నా రాంబాబు, కందుల నారాయణరెడ్డిలు కార్యకర్తలు రెచ్చిపోయేలా అరుపులు, కేకలతో నానా బీభత్సం సృష్టించారు.


