కరణం దూకుడు | Put the power of the attacks on the horizontal | Sakshi
Sakshi News home page

కరణం దూకుడు

Jan 14 2015 9:23 AM | Updated on Aug 21 2018 6:21 PM

కరణం దూకుడు - Sakshi

కరణం దూకుడు

అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లపై పోలీసులు కేసులు నమోదు చేయడం వరకే పరిమితం కావడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఒంగోలు క్రైం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లపై పోలీసులు కేసులు నమోదు చేయడం వరకే పరిమితం కావడం పలు విమర్శలకు తావిస్తోంది.
 
  స్వయానా ఎస్పీ గన్‌మెన్‌పై దాడి చేస్తేనే తామేమీ చేయలేదని, ఇప్పుడు మాత్రం అంతకన్నా ఏం జరుగుతుందని కిందిస్థాయి పోలీసు సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు అరెస్టు చేయడం విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై కేసులుంటే ఆగమేఘాలపై అరెస్టు చేసి కోర్టుకు పెట్టే పోలీసులు అధికార పార్టీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.
 
గత ఏడాది జులై 5న పాత జెడ్పీ కార్యాలయం వద్ద కరణం బలరామ్, ఆయన కుమారుడు వెంకటేష్ వీరంగం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్ కారు డ్రైవర్‌పై దాడి చేసి రక్తం కారేట్లు కొట్టారు. దీంతోపాటు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న కాన్ఫరెన్స్ హాలులోకి బలవంతంగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మీదకే ఆ దూకుడు ప్రదర్శించారు.
 
 ఆ రోజు బలరాం, వెంకటేష్‌లతోపాటు మరి కొంత మందిపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 143, 448, 353, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆరు నెలల 10 రోజులు కావస్తోంది. కేసు అయితే పోలీస్ అధికారులు నమోదు చేశారే గానీ, తదుపరి చర్యలు మాత్రం గాలికి వదిలేశారు. ఇంత వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు ఏ విధంగా తమ స్వామిభక్తిని ప్రదర్శించుకుంటున్నారో ఈ కేసు పురోగతిని పరిశీలిస్తే అర్థమవుతోంది.
 
 
 సోమవారం ప్రకాశం భవనంలో గుండ్లకమ్మ నిర్వాసితుల ఇళ్ల పట్టాల అంశంపై సమావేశం ముగిసిన తర్వాత బలరాం ఆయన తనయుడు వెంకటేష్ తన అనుచరులతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పూనుకోవడం,  కారు అద్దాలు పగులగొట్టడం, రవికుమార్ అనుచరుడు మందపాటి సురేష్ తలకు బలమైన గాయమయ్యేలా కొట్టడం లాంటివి చకచకా జరిగిపోయాయి. కలెక్టరేట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతున్నా బందోబస్తు నిర్వహించాల్సిన టూటౌన్ పోలీసుల జాడే లేదు. ఘటన తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు ఏమి జరిగిందనే విషయాన్ని మీడియా నుంచి సమాచారం సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బలరామ్ అనుచరులు ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకుని ‘మమ’ అనిపించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement