గిరిజన మహిళపై టీడీపీ నేతల దాడి

tdp leaders attack on Tribal women - Sakshi

వంగర: మండల పరిధి మగ్గూరు గ్రామంలో టీడీపీ వర్గీయులు తమ ప్రతాపం చూపారు. మహిళ అనే కనికరం లేకుండా రెచ్చిపోయారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన గిరిజన మహిళ తూడి అప్పలనర్సమ్మను కులం పేరుతో దూషించడంతో పాటు దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన సర్పంచ్‌ గంటా ఖగేంద్రనాయుడు, మరడాన సత్యంనాయుడు, చింత అప్పలనాయుడు, గంటా గాయత్రినాయుడు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలం క్రితం అప్పలనర్సమ్మకు చెందిన స్థలంలో రోడ్డు నిర్మించారు. దీనికి ఆనుకుని ఉన్న మట్టి, చెత్త తొలగించాలని సర్పంచ్‌కు చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

 శనివారం కూడా ఈ విషయంపై సర్పంచ్‌కు విన్నవించారు. ‘నాకే గట్టిగా చెబుతావా? నన్నే నిలదీస్తావా?’ అంటూ తనపై సర్పంచ్‌ దాడికి పాల్పడ్డారని ఆమె వాపోయారు. ఇంటి నుంచి సమీపంలో ఉన్న పెద్దింటి అప్పలనాయుడు ఇంటి వరకు ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టి గాయపర్చారని వాపోయారు. ఈ ఘటనలో అప్పలనర్సమ్మ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. తన భర్త ఓనె అగ్రహారం గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారని, ఆయన మరణించాక మగ్గూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నానని తెలిపారు. తనపై ఇటువంటి దాడులు అన్యాయమని పోలీసుల ఎదుట వాపోయారు. 

అప్పలనర్సమ్మపై దాడి ఘటన తెలుసుకున్న సంగాం, తలగాం, శ్రీహరిపురం, పటువర్ధనం, మగ్గూరు గ్రామాలకు చెందిన గిరిజనులు వంగర పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడే బైఠాయించారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. తూడి అప్పలనర్సమ్మను కులం పేరుతో దూషించిన నలుగురు వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదుచేశామని ఎస్సై కోట వెంకటేష్‌ తెలిపారు. మహిళలపై దాడులు ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. అప్పలనర్సమ్మను రాజాం సీహెచ్‌సీకి వైద్యం కోసం తరలించామన్నారు.

అప్పలనర్సమ్మపై కేసు
మగ్గూరు గిరిజనులు తమపై దాడికి పాల్పడ్డారని సర్పంచ్‌ గంటా ఖగేంద్రనాయుడు వంగర ఎస్సై కు ఫిర్యాదుచేశారు. గిరిజన మహిళతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయనున్నామని ఎస్సై తెలిపారు. వైఎస్సార్‌ సీపీ నేత, గిరిజన మహిళ తూడి అప్పలనర్సమ్మపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడటం దాష్టీకమని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, ఉదయాన మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు కరణం సుదర్శనరావు విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top