కబ్జాలకు కేరాఫ్‌..అతడు

Tdp Leader Finds Empty Places, Kabja - Sakshi

పుత్తూరులో పెట్రేగిపోతున్న చోటా టీడీపీ నాయకుడు

ఖాళీ డీకేటీ స్థలాలు కనిపిస్తే కబ్జానే

ప్రశ్నించిన మహిళపై చేయి చేసుకున్న ప్రబుద్ధుడు

పుత్తూరులో కి చెందిన ఓ తృతీయశ్రేణి నాయకుడు కబ్జాలకు కేరాఫ్‌ ‘అతడే’ అన్నట్లు మారాడు. ఇటీవల కాలంలో ఆయన ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఖాళీగా ఉన్న డీకేటీ స్థలాలను కబ్జా చేయడం అతని పని. ఇటీవల సదరు నాయకుడి కబ్జాపర్వాన్ని ఎదురించిన ఓ మహిళపై కూడా తన మనుషులతో భౌతిక దాడి చేయించాడు. ఈ గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపైనా సదరు నాయకుడి మనుషులు ఎదురు తిరగబోయారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో !

పుత్తూరు : మున్సిపల్‌ పరిధిలోని భవానీనగర్‌లో టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు పెట్రేగుతున్నాడు. ఖాళీ స్థలాలను కబ్జా చేయడం, ప్రశ్నించిన స్థానికులపై దాడులకు చేయించడం ఆయనకు నిత్యకృత్యమైపోయింది. రాత్రయితే చాలు సదరు నాయకుడి గ్యాంగ్‌ పట్టణంలో స్వైరవిహారం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకుడు సాగిస్తున్న ఆగడాలకు స్థానికులను బెంబేలెత్తుతున్నారు. మున్సిపల్‌ పరి« దిలో ఇళ్లులేని నిరుపేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గత ప్రభుత్వం భవానీనగర్‌లోని ఇంటిపట్టాలను మంజూరు చేసినా వారికి స్థలాలను చూపలేదు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. అయితే అంతకుమునుపు అనుభవంలో ఉన్న డీకేటీ పట్టాదారులు న్యాయస్థానం ఆశ్రయించడంతో వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. 
ఏరియా ఒకటి..పది ప్లాట్లు కబ్జా
ప్రస్తుతం సుమారు వంద కుటుంబాల వరకు భవానీనగర్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. బైపాస్‌కు ఆనుకుని ఉండడంతో ఇక్కడ ఫ్లాట్‌ ధర రూ.5 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఆ చోటా నాయకుడి కన్ను ఖాళీ స్థలాలపై పడింది. న్యాయస్థానం ఆదేశాలు ఉండడంతో ఇక్కడ కొత్తగా ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి. అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న చోటా నాయకుడు సుమారు పది ప్లాట్ల వరకు కబ్జా చేసేశాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. కాలనీలో పెరియపాలితమ్మ అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న సుమారు 10 సెంట్ల వరకు ఖాళీ స్థలంపై కూడా చోటా నాయకుడి కన్ను పడింది. ఆలయ అభివృద్ధి సాకుతో ఆ స్థలాలను విక్రయించే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
మహిళపై దాడి..
ఇటీవల సదరు నేత కబ్జా పర్వాన్ని ఎదురించిన ఒక మహిళపై ఆయన బ్యాచ్‌ రాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. తనపై జరిగిన దాడి విషయాన్ని ఆ మహిళ 100కు ఫోన్‌ చేయడంతో స్థానిక పోలీసులు భవానీనగర్‌కు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న చోటా నాయకుడి బ్యాచ్‌ పోలీసు వాహనాన్ని నిర్బంధించారు. ఆ అల్లరిమూకలను పోలీస్‌ కానిస్టేబుల్‌ తీవ్రంగా ప్రతిఘటించడంతో తప్పించుకున్నారు. తనకు ఉన్న రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సదరు నాయకుడి ఆగడాలకు అడ్డూ ఆపులేకుండా పోతోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని భవానీనగర్‌ వాసులు వేడుకుంటున్నారు.

ఫిర్యాదు వచ్చింది వాస్తవమే
భవానీనగర్‌లో ఒక మహిళపై దాడికి పాల్పడినారనే ఆరోపణలపై ఆ మహిళ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. భవానీనగర్‌ ప్రాంతంలో ఎవరైనా రౌడీయిజం, పంచాయతీలు చేయడం, స్థాని కులపై దాడులకు పాల్పడడం వంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top